‘తెలంగాణలో నయా రాచరికం’ | CLP Leader Bhatti Vikramarka Fires On CM KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పాలనంతా అయోమయం

Published Mon, Dec 14 2020 3:32 PM | Last Updated on Mon, Dec 14 2020 4:04 PM

CLP Leader Bhatti Vikramarka Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పాలన అంతా అయోమయంగా సాగుతోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ రెండేళ్ల పాలనపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారో.. ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. సెక్రటేరియట్‌లో ఏ శాఖకు ఫోన్ కలవని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.(చదవండి: టీపీసీసీ చీఫ్‌ ఎంపిక మరింత ఆలస్యం!)

ఆ హామీపై కనీసం ఊసేలేదు..
కాళేశ్వరం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఎకరాకైనా నీళ్లు పారాయా? అని భట్టి ప్రశ్నించారు. వరదలతో హైదరాబాద్ నగరం మునిగిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారని భట్టి మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన భృతి హామీకి అతీగ‌తీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కనీసం విధివిధానాలను ఖరారు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీపై కనీసం ఊసేలేదని విమర్శించారు. (చదవండి: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఏమైంది?

రాష్ట్రంలో గందరగోళం..
ధరణితో తెలంగాణ గందరగోళంలో పడిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తనకు కావాల్సిన వారికోసం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను గందరగోళం చేశారని ఆరోపించారు. వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ చేయకపోవడం రైతులకు మరింత భారంగా మారిందని.. సన్నవడ్లు పండించిన రైతుల బాధలు కేసీఆర్‌కు పట్టవా? అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి..
గ్రేటర్ ఎన్నికల ముందు ప్రకటించిన వరద సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్నికల తరువాత ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 57 ఏళ్లకే పెన్షన్ అని చెప్పిన కేసీఆర్.. కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం.. తరువాత దానిని మర్చిపోయిందన్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు సరైన వసతులు కల్పించకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. 

వారు మినహా అంతా డమ్మీలే..
కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చే అంశం పరిశీలిస్తామన్నారు.. ఎంత వరకు పరిశీలనకు వచ్చిందో ఏవరికీ తెలియదన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులకు అధికారాలు లేవు. కేటీఆర్, హారీష్ మినహా అంతా డమ్మీలే అని ఆయన వ్యాఖ్యానించారు.  కేసీఆర్ పాలనలో సామాన్య ప్రజలను, రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని, సూటు బూటు వేసుకున్నవారినే కేసీఆర్ కలుస్తారని ఘాటుగా విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల ఆలోచనను మళ్లించేందుకే భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ.. భావోద్వేగాలతో రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 

ఆ అంశంపై నిర్ణయం తీసుకోలేదు..
సీఎల్పీ నేతగా తమ ఎమ్మెల్యేలు పీసీసీ ఎంపికపై కొన్ని అభిప్రాయాలు చెప్పారు. వారి అభిప్రాయాలను ఇంఛార్జ్ మానిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఈ సందర్భంగా భట్టి మీడియాకు చెప్పారు. పీసీసీ ఎంపికపై తన అభిప్రాయాన్ని పార్టీ ఇంఛార్జ్‌కు తెలియజేసానన్నారు. ఈ సందర్భంగానే ఢిల్లీ వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోలేదని ఆయన మీడియాకు వెల్లడించారు. ఒక వేళ వెళ్లే అవకాశం ఉంటే తప్పకుండా మీడియాకు తెలియజేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement