చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై తాజాగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని మరోసారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ..
ఈ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘ఇది సీఎం వ్యక్తిగత నిర్ణయం. మీరు.(మీడియాను ఉద్ధేశిస్తూ..) నిర్ణయం తీసుకోకూడదు. మంత్రులందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని అడగండి. ఇది సీఎం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం’ అని ఉదయనిధి పేర్కొన్నారు.
అయితే ఈ పుకార్లను ఉదయనిధి కొట్టిపారేయడం తొలిసారి కాదు. గతంలోనూ మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తన వరకు యువజన విభాగం కార్యదర్శి పదవి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.
చదవండి :జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
కాగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన కొట్టిపారేశారు.
ఇక ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్‌లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment