సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్కసెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రజలపై, పేదలమీద బాబుకు ఏమాత్రం ప్రేమ లేదని దుయ్యబట్టారు.
నెలరోజులు వరుసగా రాష్ట్రంలో ఉన్నారా?
జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ గురువారం సామర్లకోటలో ప్రారంభించారు. అనంతరం స్థానికంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఇళ్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు ఒక నెల పాటు కంటిన్యూగా రాష్ట్రంలో కనిపించాడా? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో కనిపిస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
వాళ్లెవవరికి ఇక్కడ సొంతిల్లు లేదు
చంద్రబాబు, లోకేష్, ఆయన బావమరది బాలకృష్ణ, దత్తపుత్రుడు ఎవరూ రాష్ట్రంలో ఉండరని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు సొంతిల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఆయన దత్తపుత్రిడి శాశ్వత చిరునామా కూడా హైదరాబాద్‌లోనే ఉందని తెలిపారు. ప్యాకేజీ స్టార్‌కు ఓడిపోయిన భీమవరంతో, గాజువాకతో సంబంధమే లేదని మండిపడ్డారు. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని అన్నారు. ఒకరు స్టేట్, ఒకరు నేషనల్, మరొకరు ఇంటర్నేషనల్ అంటూ సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి ఆడవాళ్లు, ఇల్లాలిపై ఉన్న గౌరవమంటూ చురుకలంటించారు.
చదవండి: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్
ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే
‘వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే అప్పుడప్పుడు ప్యాకేజీ స్టార్ వస్తుంటాడు. సరుకులు అమ్ముకునే వాళ్లను చూశాం. కానీ పార్టీ, సొంతవారిని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. యూజ్ అండ్ త్రో అన్నది పవన్ పాలసీ.
బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి
సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి పవన్. షూటింగ్ గ్యాప్‌లలో రాష్ట్రానికి వస్తుంటాడు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు.
రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి
రాజకీయాలు అంటే విలువలు విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడెందుకు చేయలేకపోయారు. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు. ప్రతి నెల 1వ తారీకే ఇంటింటికి పెన్షన్లు. సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పరిపాలన.
నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం
దిశ యాప్‌తో మహిళలకు అండగా నిలిచాం. ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 రోగాలకుపైగా విస్తరించాం. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం. 2.07 లక్షల ఉద్యోగాల్లో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. చంద్రబాబు పేరు చెబితే గుర్చొచ్చేది స్కాంలే. జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తొస్తుంది.’ అంటూ చంద్రబాబు, పవన్‌లపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment