విశాఖపట్నంలో మనం చేయగలిగిన చోట అభివృద్ధి చేయకుండా వీళ్లు అడ్డుకుంటారు. ఇక్కడ మనం చేయలేం.. చంద్రబాబూ చేయలేరు. చంద్రబాబు చేయలేని దాన్ని, ఎవరూ చేయలేని దాన్ని మనం చేయాల్సిందే అని చెబుతూ రోజూ ధర్నాలు, డ్రామాలు, డ్యాన్సులు చేస్తున్నారు. మన మీద బురద జల్లాలనే దుర్బుద్ధితో డ్రామాలు ఆడుతున్నారు.
– సీఎం వైస్ జగన్
సాక్షి, విజయవాడ: రాజధాని పేరుతో ఈ ప్రాంతం వాళ్లను సైతం మోసం చేస్తున్న చంద్రబాబు విజయవాడకు కూడా చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ.. మన ప్రభుత్వం వచ్చాకే ఈ ప్రాంత అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ పెట్టామని తెలిపారు. ‘విజయవాడ పశ్చిమ బైపాస్ అభివృద్ధి చెందుతోంది.
గన్నవరం సమీపంలోని చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు రూ.1,321 కోట్లతో 30 కి.మీ. రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీనిలో 17.08 కి.మీ. పనులు పూర్తయ్యాయి. 65 శాతం పనులను పూర్తి చేశాం. 65 శాతం నిధులు వెచ్చించాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయి (రహదారి పనుల ఫొటోలను స్క్రీన్‌పై ప్రదర్శించారు). గొల్లపూడి నుంచి కృష్టానది మీదుగా బ్రిడ్జి కట్టి.. చినకాకాని వద్ద చెన్నై జాతీయ రహదారిని కలిపే రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి.
ఇది 18 కి.మీ.రోడ్డు. రూ.1,600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 33 శాతం పనులను 31 శాతం నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 2024లో ఇది పూర్తవుతుంది’ అని వివరించారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకంటే విజయవాడ, మంగళగిరి బాగా విస్తరించడానికి ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుంది. అదే జరిగితే అమరావతిలో చంద్రబాబు బినామీల భూముల విలువ పెరగదు కాబట్టి’ అని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
అక్కడ భూముల విలువ పెరిగేందుకే..
► విజయవాడ బాగుపడాలని మన ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
► కృష్ణా నదికి ఎప్పుడు వర్షాలు వచ్చినా కృష్ణలంక ప్రాంతం మునిగిపోయేది. చంద్రబాబు ఈ సమస్యను ఏనాడూ పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వచ్చాక అక్కడ రూ.137 కోట్లతో ఒకటిన్నర కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కట్టింది. (ఫొటోను స్క్రీన్‌పై ప్రదర్శించారు) దాంతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారు.
► నదికి అటువైపు మరో కిలోమీటర్ మేరకు రీటెయినింగ్ వాల్ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఇదే పెద్దమనిషి నివాసం ఉండే కరకట్టకు ఒకవైపు వాహనం వస్తే మరో వాహనం పోవడం కష్టం. కానీ ఈ పెద్దమనిషి కనీసం ఆ రోడ్డును వెడల్పు చేయలేదు. మనం రూ.150 కోట్లు ఇచ్చి ఆ పనులు మొదలు పెట్టాం.
రూ.260 కోట్లతో అంబేడ్కర్ పార్క్
► విజయవాడలోని బందరు రోడ్‌లో అంబేడ్కర్ పార్క్‌ను రూ.260 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నాం. విజయవాడ ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు, వాకింగ్ చేసేందుకు పార్క్ నిర్మిస్తున్నాం. వేగంగా పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి.
► విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఉంది. ఆ తల్లి చల్లని దీవెనలతోనే మనం క్షేమంగా ఉన్నాం. కానీ ఏ రోజైనా కానీ ఆ గుడిని అభివృద్ది చేయాలని చంద్రబాబు ఆలోచంచనే లేదు. కొండ రాళ్లు పడిపోతున్నా పట్టించుకోలేదు. అదే మన ప్రభుత్వం ఆ గుడి కోసం రూ.70 కోట్లు ఇచ్చింది. అదే చంద్రబాబు తన హయాంలో 40 గుడులు కూల్చేశారు. ఏదైనా చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే పనులు జరుగుతాయి. డ్రామాలు చేస్తే చివరకు గ్రాఫిక్స్ మాత్రమే మిగులుతాయి.
పది శాతం డబ్బుతో విశాఖపట్నం అభివృద్ధి
► ఇక్కడ వెచ్చించాలంటున్న దానిలో కేవలం 10 శాతం అంటే రూ.1.10 లక్షల కోట్లకు గానూ... కేవలం రూ.10–11 వేల కోట్లు విశాఖపట్నంలో ఖర్చు చేస్తే ఆ నగరాన్ని మనం ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో ఇప్పటికే రోడ్లు ఉన్నాయి. డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి కనీస వసతులు ఉన్నాయి. వీటి మీద మనం ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. కేవలం మెరుగులు దిద్దేందుకు కాస్తా డబ్బులు పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment