
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణ కాంక్షను అర్థం చేసుకోలేక కొంతమంది పిచ్చికూతలు కూశారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. సచివాలయం కూలుస్తారా అంటూ తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు వారికి బుద్ధి వచ్చేలా ఆకాశమంతా అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించామని తెలిపారు. అంబేద్కర్, గాంధీజీ చూపించిన మార్గంలోనే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పల్లెలు కూడా అద్భుతంగా విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు.
చదవండి: సచివాలయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా: సీఎం కేసీఆర్
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరుగుజ్జులు, కళ్ళున్న కబోధులు అభివృద్ధిని చూడలేరంటూ ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ చురకలంటించారు. తెలంగాణ పునర్నిర్మాణ కాంక్షను అర్థం చేసుకోలేని కొంతమంది కారు కూతలు కూశారని మండిపడ్డారు. వాళ్లకి పాలన సౌలభ్యం కనబడదని విమర్శించారు. కొంతమంది మరుగుజ్జుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇది తెలంగాణ పునర్నిర్మాణం అంటే..
‘పెద్ద ఎత్తున నీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఎర్రటి ఎండకాలంలో మత్తడి దూకుతున్న ప్రాజెక్టులు కళ్లున్న కబోదులకు కనపడదు. 24 గంటల కరెంట్‌తో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు లేని తెలంగాణ ఏర్పడింది. వ్యవసాయానికి ఇస్తున్న కరెంట్ వల్ల రైతులు ఆనందంగా ఉంది. కోల్పోయిన అటవీ సంపద సాధించుకున్నాం. ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా తొలగించి ఇంటింటికి నీళ్ళు అందించాం. ఆర్ధిక పరిపుష్టి పాటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాడు బీళ్లుగా మారిన పంటలు, నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రపంచ ఇంజనీదింగ్ అద్భుతాలుగా ప్రాజెక్టులు కట్టాం
తెలంగాణ రైతుల దర్పమే తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, పునరంకితం, పునర్నిర్మణంలో బాగంగా కొత్త నిర్మాణాలు కట్టుకున్నాం. అడ్డదిడ్డంగా, ఎండలో ఫైళ్లు పట్టుకుని అక్కడికి ఇక్కడికి వెళ్లే భవనాల నుంచి కొత్త శోభాయమానంగా కొత్త సచివాలయం ఏర్పాటయింది. తెలంగాణ సచివాలయంవలె తెలంగాణ పల్లెలను అభివృద్ది చేసిన ప్రజా ప్రతినిదులను అభినందిస్తున్నాను. ఆకాశమంత ఎత్తున ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టుకున్నాం. తెలంగాణ అమరులకు నేను నివాళులు అర్పిస్తున్నా’ నని పేర్కొన్నారు.
Inauguration of Dr. B.R. Ambedkar Telangana State Secretariat. Watch live as CM Sri KCR addresses the State. #PrideOfTelangana #TriumphantTelangana https://t.co/xVrEqBVec2
— Telangana CMO (@TelanganaCMO) April 30, 2023
Comments
Please login to add a commentAdd a comment