అసైన్డ్‌ పట్టాలపైనే తొలి తీర్మానం  | CM KCR Fires On Congress Party Leaders At Public Meeting | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ పట్టాలపైనే తొలి తీర్మానం 

Published Tue, Nov 28 2023 5:46 AM | Last Updated on Tue, Nov 28 2023 5:46 AM

CM KCR Fires On Congress Party Leaders At Public Meeting - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  ‘రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వందకు వందశాతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. గెలుపొందిన తర్వాత మంత్రివర్గం చేసే తొలి తీర్మానం అసైన్డ్‌ భూములకు సంబంధించిన పట్టాల అంశంపైనే ఉంటుంది. పట్టాలు ఇవ్వడమే కాదు.. వాటిని అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తాం. అసైన్డ్‌ భూములు గుంజుకుంటారని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అసైన్డ్‌దారులకే అన్ని హక్కులు కల్పిస్తాం..’ అని భారత్‌ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్‌ చెప్పారు.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి కాంగ్రెసోళ్లు రైతుబంధును నిలిపి వేయించారని విమర్శించారు. ‘ఇలా ఎన్ని రోజులు ఆపుతారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆపితే ఈ పథకం ఆగిపోదు. కేసీఆర్‌ బతికున్నంత కాలం నిరాటంకంగా కొనసాగుతుంది. డిసెంబర్‌ మూడో తేదీన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 6వ తేదీ నుంచి రైతులందరికీ  రైతుబంధు ఇస్తాం. ఈ విషయంలో రైతులు బాధపడాల్సిన అవసరం లేదు..’ అని స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్, చేవెళ్ల, సంగారెడ్డి జిల్లా కేంద్రం, ఆందోల్‌ పట్టణాల్లో నిర్వహించిన  ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు.
 
సంక్షేమంలో దేశానికే ఆదర్శం 
‘సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. కాంగ్రెస్‌ యాభై ఏళ్లు పాలిస్తే.. బీఆర్‌ఎస్‌ పదేళ్లు పాలించింది. అప్పుడు, ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200 పెన్షన్‌ ఇస్తే..బీఆర్‌ఎస్‌ రూ.2 వేలకు పెంచింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 వేలకు పెంచుతాం. గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లు అందిస్తున్నాం. అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం తర్వాత అదే వాహనంలో ఊర్లో దించుతున్నాం.

కేసీఆర్‌ కిట్‌ కింద మగ బిడ్డపుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు ఇస్తున్నాం. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, కళ్లద్దాలు ఇచ్చాం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారాక్‌ కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తున్నాం. రైతుబంధు దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నాడు. రైతుబంధు దుబారానా? కాంగ్రెస్‌లోనూ రైతుబంధు తీసుకునే రైతులు, నాయకులు ఉన్నారు.

వారికి సిగ్గు ఉందా? కాంగ్రెస్‌ను ఎలా సపోర్ట్‌ చేస్తారు? గుండెపై చేయి వేసుకుని ఆలోచించాలి. గత ఆరేళ్లుగా రెండు విడతల్లో రైతుబంధు వేస్తున్నాం. కానీ కాంగ్రెస్‌ వాళ్లు ఒక్క విడత రైతుబంధు వేస్తేనే మాకు ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పథకం ఆపారు. యాసంగి పంటల కోసం నేను చెప్పిన తర్వాత అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆపారు..’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు బాగుపడ్డారు? 
‘నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ అన్నీ బాధలే. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు బాగుపడ్డారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2 కేజీ బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మాట్లాడితే మత కల్లోలాలు, కర్ఫ్యూలు ఉండేవి. తద్దినం అని భోజనానికి పిలిస్తే మీ ఇంట్లో రోజూ ఇలాగే జరగాలని కోరుకున్నట్లు ఉంది కాంగ్రెసోళ్ల పరిస్థితి. టైలర్‌ బట్టలు కుడుతున్నాడు.. సూది కింద పడిపోయింది.. సూది దొరికితే కిలోశక్కరి పంచి పెడతానని దేవునికి మొక్కాడు.. ఇదేంటని ఆయన భార్య అడితే.. సూదైతే దొరకని.. శక్కరి పంచిపెట్టకపోతే దేవుడేం చేస్తాడు.. అన్న మాదిరిగా ఉంది వారి వైఖరి..’ అని ఎద్దేవా చేశారు. 

రైతులకు ధరణే శ్రీరామ రక్ష 
‘ధరణి పోర్టల్‌ పుణ్యమా అని రైతులు నిశ్చితగా ఉన్నారు. కాంగ్రెసోళ్ళు దాన్ని తొలగించి భూమాత తెస్తామంటున్నారు. అది భూ మాతనా? భూ మేతనా? ధరణి పోతే..రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి? మళ్లీ మొదటికే వస్తుంది. నీ భూమి నాకు..నా భూమి నీకు రాసి పంచాయితీ పెట్టే కాంగ్రెస్‌ కావాలా? తేల్చుకోవాలి. కాంగ్రెసోళ్లు డబ్బులు కౌలుదారులకు ఇస్తామంటున్నారు రైతులకు ఇవ్వం అంటున్నారు. రైతు మెడకు కౌలు రైతులను దూలం లెక్క పెడతామంటున్నారు. పెట్టించుకుందామా? ధరణే రైతుల భూములకు శ్రీరామ రక్ష. కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మితే కైలాసంలో పెద్ద పాము మింగినట్లే..’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 

ఇంకో పార్టీకి మతం పెచ్చి 
‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్రంలో ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం. పీఆర్‌సీ కూడా వేశాం. ఆర్టీసీని ఇటీవలే ప్రభుత్వంలో విలీనం చేశాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. మైనార్టీల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక ఐటీ హబ్‌ ఏర్పాటు చేస్తాం. హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు లాంటి వారు. మైనార్టీల సంక్షేమ నిధులను రూ.2 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు పెంచాం. కాంగ్రెస్‌ తన 50 ఏళ్ల పాలనలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా భావించింది. ఇంకో పార్టీకి మతం పిచ్చి. మంటలు పెట్టడం, మసీదులు తవ్వుదామా.. దర్గాలు తవ్వుదామా.. ఇదే తప్ప వేరే లేదు.. ప్రజలను విభజించి పాలిస్తుంది..’ అని ధ్వజమెత్తారు. 

నెలన్నరలో మాస్లర్‌ ప్లాన్‌ క్లియర్‌ 
‘తెలంగాణ ఉద్యమంలో నేను కనిపెట్టిన ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లె. ఎక్కువ భూములు మునగకుండా సాధ్యమైనంత త్వరలో రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం. షాద్‌నగర్‌కు సాగునీళ్ల బాధపోతుంది. చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్‌కు దగ్గలో ఉంది. గత పాలకులు ఈ ప్రాంతంపై కొన్ని (111 జీఓ రూపంలో) ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్లెవరూ వాటిని ఎత్తేసే ప్రయత్నం చేయలే. పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేయలే. బీఆర్‌ఎస్‌ హయాంలో షాబాద్‌లో వెల్‌స్పన్‌ కంపెనీ, చందనవెళ్లిలో అమెజాన్‌ కంపెనీ, సీతారాంపురంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ, కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వచ్చాయి.

గత ఎన్నికల్లో 111 జీఓ ఎత్తివేస్తామని హామీ ఇచ్చాం. ఈ మేరకు పూర్తిగా ఎత్తేశాం. అయితే దానికి మాస్టర్‌ ప్లాన్‌ కొంత అడ్డంకిగా మారింది. నెలన్నరలో మాస్టర్‌ ప్లాన్‌ క్లియర్‌ అవుతుంది. జీఓను పూర్తిగా ఎత్తివేయించే బాధ్యత నాదే. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆన్‌ చేశాం. మీ వాటా మీకే ఉంది. ఉద్ధండపూర్‌ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం. కాలువలు తవ్వితే చాలు వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీరు, తాగు నీరు వస్తుంది. ఇక్కడికి కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం..’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

రాయేదో, రత్నమేదో గుర్తించాలి 
‘ఎన్నికలొస్తే దేశంలో ఆగమాగం ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో చాలా పరిణితి రావాలి. మంచేదో.. చెడేదో? రాయేదో.. రత్నమేదో? గుర్తించాలి. అభ్యర్థులపై ఆరా తీయాల్సిందే. వీరి వెనుక ఉండే పార్టీల నడవడిక, ప్రజల గురించి ఆలోచించే విధానంపై ఆరా తీయాలి. గ్రామాల్లో చర్చలు పెట్టాలి. ఆలోచించి ఓటు వేయాలి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభల్లో మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థులు చింత ప్రభాకర్‌ (సంగారెడ్డి), చంటి క్రాంతికిరణ్‌ (ఆందోల్‌), అంజయ్య యాదవ్‌ (షాద్‌నగర్‌),  కాలె యాదయ్య (చేవెళ్ల) తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement