సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాల విస్తరణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి తర్వాత కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు గుర్తింపు దక్కిన నెల రోజుల్లోపే పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన కేసీఆర్.. జనవరి నెలాఖరులోగా మరో ఆరేడు రాష్ట్రాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
తొలుత తెలంగాణకు సరిహద్దుగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో బీఆర్‌ఎస్ శాఖల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఒడిశా, పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లోనూ వీలైనంత త్వరగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయిం చారు. ప్రత్యేకించి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రాంతాలపై పట్టు సాధించేలా కేసీఆర్ ప్రత్యేక వ్యూహానికి పదును పెడుతున్నారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీఆర్‌ఎస్‌కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
కర్ణాటకలో ఇప్పటికే చురుగ్గా..
కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయచూర్, కొప్పాల్, బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, బీడ్, ఔరంగాబాద్, పర్బనీ, నాగపూర్, చంద్రాపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ కార్యక లాపాలకు శ్రీకారం చుడుతున్నారు. కర్ణాటకలో కల్లుగీత వృత్తిని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో జేడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మద్దతు ప్రకటించారు. గుల్బర్గాలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘానికి చెందిన పలువురు ముఖ్య నేతలతో కలిసి పాదయాత్ర వాల్‌పోస్టర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి (నారాయణపేట్), భూపాల్‌రెడ్డి (నారాయణఖేడ్) తదితరులు తమకు పొరుగునే ఉన్న కర్ణాటకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడి నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఉన్న పరిచయాలను ఆధారంగా చేసుకుని వ్యక్తిగతంగా భేటీ అవుతూ, చిన్న చిన్న బృందాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ తదితరులు కర్ణాటకలోని గదగ్ ప్రాంతంలో గత నెలలో పర్యటించారు. కిసాన్ జాగృతి వికాస్ సంఘం ప్రతినిధులతో జరిగిన భేటీలో బీఆర్‌ఎస్ విధానాలను వివరించారు. జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి నేతృత్వంలోని బృందం కూడా చించోలి, సేడం తదితర ప్రాంతాల్లో పర్యటించి బీఆర్‌ఎస్‌పై అభిప్రాయాలు సేకరించారు.
మహారాష్ట్రలోనూ ముమ్మరం
మహారాష్ట్రలోనూ బీఆర్‌ఎస్ విస్తరణకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలు ముమ్మరం చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మరికొందరు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే నాందేడ్ జిల్లా బోకర్ నియోజకవర్గంలో పర్యటించారు. త్వరలోనే మహారాష్ట్రలోని షోలాపూర్, పుణె, గుజరాత్‌లోని సూరత్ ప్రాంతాలకు కూడా బీఆర్‌ఎస్ నాయకులు వెళ్లనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ తదితరులు కూడా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించి వచ్చారు.
అధినేతకు ఎప్పటికప్పుడు నివేదికలు
తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను పొరుగు రాష్ట్రాల్లో వివరిస్తూనే, మరోవైపు బీఆర్‌ఎస్ పట్ల వారి అభిప్రాయాలను నేతలు తెలుసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకోవడంతో పాటు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జాబితాను తయారు చేయడంతో పాటు వారి నేపథ్యాన్ని కూడా ఆరా తీస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో తాము పరిశీలించిన విషయాలతో కూడిన నివేదికలను ఎప్పటికప్పుడు రూపొందించి పార్టీ అధినేత కేసీఆర్‌కు అందజేస్తున్నారు. ఇదే తరహాలో పంజాబ్, హరియాణాతో పాటు తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ బీఆర్‌ఎస్ విస్తరణ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment