సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోనూ భారత్ రాష్ట్ర సమితి బలోపేతానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లనున్న సీఎం..తిరుగు ప్రయాణంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎంపీ వేణుగోపాలచారి.. మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలతో కలిసి సమన్వయం చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ మాణిక్ కదమ్ పర్యవేక్షిస్తున్నారు.
పండరీపూర్, తుల్జాపూర్‌లో ప్రత్యేక పూజలు
షోలాపూర్‌లో రాత్రి బస అనంతరం మంగళవారం ఉదయం స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజలతో పాటు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం పండరీపూర్ పట్టణానికి చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్థానికంగా జరిగే బీఆర్‌ఎస్ సభలో ఎన్‌సీపీ దివంగత ఎమ్మెల్యే భరత్ భాల్కే కుమారుడు భగీరథ్ భాలే్క.. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు. మధ్యాహ్నానికి తుల్జాపూర్ చేరుకుని భవానీమాత మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడికి సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు వస్తారు.
భారీ ఏర్పాట్లు..
తెలంగాణ ఉద్యమ సమయంలో భారీ కార్ల ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అందరి దృష్టినీ ఆకర్షించిన కేసీఆర్, బీఆర్‌ఎస్ బలోపేతానికి ప్రస్తుతం అదే తరహా వ్యూహానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో రోడ్డు మార్గాన ప్రయాణించడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 65వ నంబరు జాతీయ రహ దారి పొడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ భారీయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వాహన కాన్వాయ్‌లో పలువురు కేబినెట్ మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు సీఎం వెంట వెళ్లనున్నారు.
మహారాష్ట్రలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా..
గత ఏడాదిలో బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, కాందార్ లోహ, ఔరంగాబాద్, నాగపూర్‌లో జరిగిన సభలు, సమావేశాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. నాగపూర్‌లో పార్టీ తొలి శాశ్వత కార్యాలయాన్ని కూడా ప్రారంభించడంతో పాటు ఔరంగాబాద్, షోలాపూర్, పుణే, ముంబయిలోనూ శాశ్వత కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సభ్యత్వ నమోదుతో పాటు 45 వేల జనావాసాల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మహారాష్ట్రలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పనిచేస్తుండగా, ప్రస్తుతం కేసీఆర్ రెండురోజుల పర్యటన బీఆర్‌ఎస్‌కు మరింత ఊపు తెస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
రోడ్డు మార్గంలో 315 కిలోమీటర్లు..
సోమవారం ఉదయం ప్రగతిభవన్‌లో మంత్రులు, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి సీఎం కేసీఆర్ అల్పాహారం చేస్తారు. ఉదయం 10 గంటల సమయంలో సుమారు 500 వాహనాలు అనుసరిస్తుండగా 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్రకు బయలుదేరతారు. కూకట్‌పల్లి, పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పట్టణాల మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తారు. ఆ రాష్ట్రంలోని హుమ్నాబాద్, బసవకళ్యాణ్ మీదుగా సాయంత్రం నాలుగు గంటలకు మహారాష్ట్రలోని ఒమర్గాకు చేరుకుంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి షోలాపూర్‌కు బయలుదేరతారు. హైదరాబాద్ నుంచి మొత్తం సుమారు 315 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణానంతరం రాత్రి 10 గంటలకు అక్కడికి చేరుకుంటారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ చేరుకున్న పొంగులేటి, జూపల్లి
Comments
Please login to add a commentAdd a comment