మాట నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Comments On BRS Govt Harish Rao | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

Published Fri, Aug 16 2024 5:09 AM | Last Updated on Fri, Aug 16 2024 5:09 AM

సీతారామ రెండో పంపును ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల

సీతారామ రెండో పంపును ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల

రూ.31 వేల కోట్లతో రైతులను రుణ విముక్తులను చేశాం: సీఎం రేవంత్‌రెడ్డి

హరీశ్‌రావును సవాల్‌ చేస్తున్నా.. మాట మీద నిలబడి రాజీనామా చెయ్యి 

ప్రజల నమ్మకం కోల్పోయి బీఆర్‌ఎస్‌ దీనంగా, హీనంగా మారింది 

రీడిజైనింగ్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు దోపిడీకి పాల్పడింది 

రూ.1,500 కోట్లతో పూర్తయ్యే సీతారామ ప్రాజెక్టు అంచనాలు పెంచారు 

కేసీఆర్‌ చేసిన అప్పులకు మిత్తీలు కట్టేందుకే కొత్త అప్పులు చేస్తున్నాం 

సీతారామ ప్రాజెక్టు పంపుల ప్రారంభం.. ఖమ్మం జిల్లా వైరాలో సభ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ పార్టీ 2022 మే 6న వరంగల్‌ గడ్డపై రైతు డిక్లరేషన్‌ ప్రకటించిందని.. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఒకేరోజు రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు రుణమాఫీ చేసి చూపిస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు మాట నిలబెట్టుకోవాలని సవాల్‌ చేశారు. 

రేవంత్‌ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ పంపులను ప్రారంభించారు. తర్వాత ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన రైతాంగ సభలో పాల్గొని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రేవంత్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ 2004లో తెలంగాణ ఇచ్చారు. ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ వరంగల్‌ డిక్లరేషన్‌లో రుణమాఫీ ఇస్తామని వాగ్దానం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టువదలని ప్రయత్నంతో రైతుల రుణమాఫీ పూర్తయ్యేలా చేసి రాహుల్‌గాంధీ మాట నిలబెట్టారు. 

జూలై 18న మొదలుపెట్టి అతి తక్కువ సమయంలో రుణమాఫీ చేశాం. ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచుతామన్న హామీలు అమలు చేశాం. వైఎస్‌ దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే.. డబుల్‌ బెడ్రూంల పేరిట కేసీఆర్‌ మోసం చేశారు. 

బీఆర్‌ఎస్‌ బతుకు బస్టాండే.. 
మా సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నరు. కాంగ్రెస్‌ మోసం చేస్తోందని కేసీఆర్‌ ఆరోపణలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా ఇంకా బుద్ధి మారలేదా? తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మితే ఒక్క సీటైనా ఇచ్చేది. 

మీ పార్టీ పరిస్థితి హీనంగా దివాలా తీసి బతుకు బస్టాండ్‌ అయింది. అడవి పందులు తిన్నంత తిని ఊరుకోకుండా పంట పొలాలను సర్వనాశనం చేస్తాయి. అలాగే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు చేయగలిగినంత దోపిడీ చేసి ఊరుకోకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. కేసీఆర్‌ చేసిన అప్పులకు మిత్తీలు కట్టేందుకే మేం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.  

రీడిజైనింగ్‌ పేరుతో భారీ దోపిడీ 
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించే ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు ఖర్చు పెడితే సరిపోయే సమయంలో రీడిజైనింగ్‌ పేరిట అంచనాలను రూ. 18 వేల కోట్లకు పెంచి మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ప్రజలను దోపిడీ చేశారు. కేసీఆర్‌ పాలన అంతా అంచనాలు పెంచుడు, నిధులు మెక్కుడు మీదనే ఉండేది. దోపిడీ గురించి తెలిసిపోతుందనే భయంతోనే సీతారామ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రానికి సమర్పించకుండా పదేళ్లు కాలయాపన చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి.. అనుమతులు తెచ్చాం.  

‘సీతారామ’తో 7 లక్షల ఎకరాలకు నీళ్లు.. 
భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ప్రతిపాదనతో ఈరోజు సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు పొంగింది. కృష్ణా జలాలు ఖమ్మం జిల్లాకు అందకపోతే గోదావరి జలాలను తీసుకువచ్చి కాల్వల్లో పారించాలనే ఆలోచన ముందుకెళ్తున్నాం. ఇంకో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తేగానీ ‘సీతారామ’ప్రాజెక్టు పూర్తవదు. 2026 ఆగస్టు 15లోపు ప్రాజెక్టు పూర్తిచేసి ఖమ్మం జిల్లాలో 7లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 

దీనికితోడు పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలమై రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది..’’అని రేవంత్‌ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు పోరిక బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మూడు పంపులు.. ముగ్గురితో ప్రారంభం.. 
హెలికాప్టర్‌ ద్వారా పూసుగూడెం చేరుకున్న సీఎం రేవంత్, మంత్రులు అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత పంపుహౌస్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుకుని మోటార్లు స్విచాన్‌ చేశారు. మొదటి పంపును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెండో పంపును సీఎం రేవంత్‌రెడ్డి, మూడో పంపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే సీతారామ ప్రాజెక్టుతో భద్రాద్రి జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ (మాస్‌లైన్‌) ఆధ్వర్యంలో నిరసనలకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement