ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త! | CM Revanth Reddy comments at Congress Legislative Party meeting: Telangana | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త!

Published Mon, Sep 23 2024 4:21 AM | Last Updated on Mon, Sep 23 2024 4:22 AM

CM Revanth Reddy comments at Congress Legislative Party meeting: Telangana

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

జాగ్రత్తగా పనిచేస్తే రెండోసారి కూడా అధికారం మనదే.. 

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి చేర్చే బాధ్యత తీసుకోవాలి 

గత 9 నెలల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశా.. 

కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేస్తే కచ్చితంగా అవకాశాలు లభిస్తాయని వ్యాఖ్య 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యేలకు వివరించిన ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఇవ్వొద్దని, ముఖ్యంగా అధికారుల పోస్టింగ్‌ల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం, పోస్టింగుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందువల్ల ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పనిచేసుకుంటే.. రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. 

టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతల స్వీకారం నేపథ్యంలో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సీఎల్పీ సమావేశమైంది. ఈ కార్యక్రమంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సన్మానించారు. మహేశ్‌గౌడ్‌ నియామకంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్‌ గాం«దీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పారీ్టలో సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. 

సమన్వయంతో ముందుకు వెళ్లాలి 
సమావేశంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ నేతలు తీసుకోవాలని కోరారు. ‘‘పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. లోక్‌సభ సీట్లు గెలిచాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్‌ పార్టీలో కచి్చతంగా అవకాశాలు వస్తాయి. 

నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టే మహేశ్‌ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి వచి్చంది. బీసీల కులగణన చేయాలన్నది రాహుల్‌ గాంధీ బలమైన ఆలోచన. ఆయన ఆలోచన మేరకు రాష్ట్రంలో బీసీ కమిషన్‌ చైర్మన్, సభ్యులను నియమించాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభాను లెక్కించాల్సిందే. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్‌ నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సుప్రీం తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగోసారి గెలవడం కోసమే జమిలి ఎన్నికలు తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

ప్రజల్లో ఉండేవారికే డీసీసీల బాధ్యతలు 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొమ్మిది నెలల కాలంలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్‌ చెప్పారు. అధికారం కోల్పోయిన అసహనంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ఆ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని.. తెలంగాణలో చేసి చూపించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ డిజిటల్‌ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్‌ తీసుకునే అవకాశం కలి్పస్తామని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవులు వస్తాయన్నారు. ఇన్‌చార్జ్‌ మంత్రులు వారానికి రెండు సార్లు తమ జిల్లాలో పర్యటించాలని సూచించారు. 

కార్యకర్తల రుణం తీర్చుకోవాలి: మహేశ్‌గౌడ్‌ 
తాను పీసీసీ అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తానని.. పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని పీసీసీ చీఫమహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. పార్టీని ముందుకు నడపడంలో సమష్టి బాధ్యత అవసరమన్నారు. కార్యకర్తలు, నేతలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేసినందుకే అధికారంలోకి రాగలిగామన్న విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గుర్తించాలని.. ఆ కార్యకర్తల రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలను గెలిపించుకోవడం ద్వారా పార్టీ కార్యకర్తలను గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు పదవుల్లో కూర్చోబెట్టాలన్నారు.

సీఎం రేవంత్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని.. కార్యకర్తలను సమాయత్తం చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని మహేశ్‌గౌడ్‌ చెప్పారు. రాహుల్‌ గాం«దీని ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పనిచేయాలని కోరారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం 
సీఎం రేవంత్‌ సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి గురించి ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్ర ఖ జానాకు నెలకు సగటున రూ.18 వేలకోట్ల ఆదా యం వస్తోందని.. అందులో రూ.6 వేలకోట్లు ప్రభు త్వ ఉద్యోగుల జీతాలకే పోతాయని, మరో రూ.6 వేలకోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకు చెల్లిస్తున్నామని చెప్పారు. మిగతా రూ.6 వేలకోట్లలో రూ.3 వేలకోట్లు ప్రభుత్వ పథకాల అమలు కోసం ఖర్చవుతున్నాయని, ఇంకో రూ.3 వేల కోట్లతో కొత్త పథకాల అమలు, ప్రభుత్వ నిర్వహణ జరుగుతోందని వివరించారు. ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉండటంతో దుబారా ఖర్చులు తగ్గించుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు. 

⇒ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ, ఫ్యామిలీ హెల్త్‌ కార్డుల అంశాలను ఎమ్మెల్యేలకు సుదీర్ఘంగా వివరించారు. పాత రేషన్‌కార్డులు తొలగించడం లేదని.. ఈ విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని సూచించారు. 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. 
 ఇక ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బాలూ నాయక్, పరి్ణకారెడ్డి, అమీర్‌ అలీఖాన్‌ తదితరులు మాట్లాడారు.

సీఎల్పీ సమావేశానికి ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేలు! 
ఆదివారం రాత్రి జరిగిన సీఎల్పీ సమావేశానికి బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా హాజరవడం గమనార్హం. పీఏసీ చైర్మన్‌ అరెకపూడి గాం«దీతోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రి సీతక్క, ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అనివార్య కారణాలవల్ల సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.

గాంధీ నియోజకవర్గమనే వచ్చారు: మంత్రి శ్రీధర్‌బాబు  
పీఏసీ చైర్మన్‌ అరెకపూడి గాంధీ బీఆర్‌ఎస్‌ నేత అయినప్పుడు సీఎల్పీ సమావేశానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలకు.. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. ఏదైనా నియోజకవర్గానికి సీఎం వచి్చనప్పుడు స్థానిక ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలవడం సాధారణమేనని చెప్పారు. సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉందని.. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని పేర్కొన్నారు. సిద్దిపేటలో సీఎం కార్యక్రమం జరిగితే హరీశ్‌రావు వెళ్లరా? అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement