సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే ఆ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు.
‘బీఆర్‌ఎస్‌కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారు. అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరం. ఆయన అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 9వ తేదీ మా ప్రభుత్వం రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఈ రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు హామీలు అమలు చేశాం. ప్రతిపక్షం సహకరించకపోయినా ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తాం.
గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలను పొందుపరిచాం. అయినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ల నాయకున్ని మెప్పించడానికి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని బండ్ల మీద రాసుకోవడంతో పాటు గుండెల మీద పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కానీ అప్పటి పాలకులు టీజీకి బదులు టీఆర్‌ఎస్ వచ్చేలా టీఎస్ అని పెట్టుకున్నారు. దానిని మార్చాం. రాజరిక పోకడలున్న అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించాం’ అని రేవంత్ తెలిపారు.
త్వరలోనే గ్రూప్ 1.. వయోపరిమితి 46 ఏళ్లు
‘ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదు. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన ఉంటుంది. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తాం. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది. తొందరలోనే పోలీస్ శాఖలో 15వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూనివర్సిటీల వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే సొంత మనుషులనే వాళ్లు అనుమానిస్తున్నారు. సీఎంగా అందరినీ కలవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం నా భాధ్యత. బీఆర్‌ఎస్ అవలంబించిన పద్ధతిలో నేను చెయ్యను. గతపు ఆనవాళ్లు సమూలంగా ప్రక్షాళన చేసే భాధ్యత నాది. కాళోజీ కళాక్షేత్రం తొమ్మిదేళ్లుగా పూర్తి చెయ్యలేదు గత ప్రభుత్వం’ అని రేవంత్ విమర్శించారు.
గతంలో ఒకరిది అగ్గిపెట్టె డ్రామా.. ఇప్పుడొకరిది ఆటో డ్రామా
‘తెలంగాణ గీతాన్ని కేబినెట్ ఆమోదం తెలిపితే మెచ్చుకోకపోగా విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పైసలు 9 నెలల పాటు పడ్డాయి. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వేశాం. ఆటో కార్మికుల పక్షాన ఒకరు ఆటోలో డ్రామాలు వేశారు. గతంలో ఒకరు అగ్గిపెట్టె డ్రామాలు ఆడితే...మొన్న ఆటో డ్రామా మరొకరు వేశారు. వాళ్ళ ఇండ్లలో నాలుగైదు ఉద్యోగాలు ఉన్నాయి...కారుణ్య నియామకాలు మాత్రం చేపట్టలేదు’ అని రేవంత్ బీఆర్‌ఎస్‌కు చురకలంటించారు.
ఇదీ చదవండి.. ధర్మపురి అర్వింద్‌కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ
Comments
Please login to add a commentAdd a comment