బీఆర్‌ఎస్‌ చచ్చింది.. బీజేపీతోనే మా పోరు : సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy Press Meet On Parliament Elections | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ చచ్చింది.. ఎంపీ ఎన్నికల్లో బీజేపీతోనే మా పోరు : సీఎం రేవంత్‌

Published Tue, Jan 30 2024 7:54 PM | Last Updated on Tue, Jan 30 2024 8:55 PM

Cm Revanth Reddy Press Meet On Parliament Elections - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ చచ్చిపోయిందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పోరు బీజేపీతోనే టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. బావ, బామ్మర్దులు ఇటీవల బీజేపీని పల్లెత్తుమాట అనకుండా కాంగ్రెస్‌ను విమర్శించడమే బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటేననడానికి నిదర్శనమని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికలపై మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ మీటింగ్‌ తర్వాత రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

‘మోదీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో 17 సీట్లు గెలవాల్సిందే. కేంద్రంలో కాంగ్రెస్‌​ గెలిస్తేనే విభజన హామీలు పరిష్కారం అవుతాయి. పదేళ్లలో విభజన హామీలను కేసీఆర్‌ అడగలేదు. మోదీ నెరవేర్చలేదు. రాహుల్‌ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం. భారత్‌ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ విమర్శలు చేయడం సరికాదు. 

పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాం. మార్చి 3వ తేదీ వరకు ఎంపీ ఎన్నికలకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తాం. ఎన్నికల సెలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీకి గుజరాత్‌ నేత జిగ్నేష్‌ మెవానీ అధ్యక్షత వహిస్తారు. మార్చి 15 నుంచి 20 లోపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) లోక్‌సభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటుంది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసే సభతో పార్లమెంట్‌ ఎన్నికలకు సమరశంఖం పూర్తిస్తాం. 

రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం వాయిదా వేశారు. కోదండరాంను ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకునేందుకే కోర్టులో కేసులు వేశారు. కేసీఆర్‌కు కోదండరాం గొప్పతనం తెలియదు. ఎమ్మెల్యేలు ఎవరడిగినా అపాయింట్‌మెంట్‌ ఇస్తా. కేసీఆర్, కేటీఆర్‌ హరీష్ రావు లకు కూడా సమయం ఇస్తా. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీచేయాలని తీర్మానం చేసి పంపాం. సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరిస్తామని ఆశిస్తున్నాం. బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఉంటాయి. కాళేశ్వరంపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభమైంది. ఇరిగేషన్‌పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తాం’ అని రేవంత్‌ తెలిపారు. 

ఇదీచదవండి.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement