
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ. చిత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి, పొన్నం, మాణిక్‌రావ్ ఠాక్రే, పొంగులేటి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2004లో కరీంనగర్ గడ్డ మీద సోనియాగాంధీ మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడి 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఆ స్ఫూర్తి, ఆలోచనతోనే ఈ ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ ఆరు గ్యారంటీల్లో రెండింటిని సోనియా జన్మదినం సందర్భంగా శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నాం.
తెలంగాణ ఇచ్చినట్టుగానే ఆరు గ్యారంటీలనూ అమలు చేస్తాం..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. అసెంబ్లీ ప్రాంగణంలోనే చేయూత, మహాలక్ష్మి పథకాలకు పచ్చజెండా ఊపారు. ‘చేయూత’పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర మంత్రులు, శాసనసభ్యులతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో నిక్కచ్చిగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు అని వ్యాఖ్యానించారు.
లోగో ఆవిష్కరించి.. జెండా ఊపి..
‘చేయూత’పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ లోగో, పోస్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతోపాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో కలసి మహిళల ఉచిత ప్రయాణ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత టికెట్‌ను ఆవిష్కరించారు.
ఉప్పల్ డిపోకు చెందిన టీఎస్08జెడ్ 0143 నంబర్ బస్సులో మహిళా ప్రయాణికులతో కలసి లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రయాణించారు. ఈ బస్సులో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మహిళా ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, టీకే శ్రీదేవి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మహిళా ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యేల బంధువులు ప్రయాణించారు.
ఈ సందర్భంగా తొలి ఉచిత టికెట్‌ను తెలంగాణకు చెందిన ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్‌కు రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ బస్సుతోపాటు ఏర్పాటు చేసిన మరో రెండు బస్సుల్లో జీహెచ్‌ఎంసీ కార్మికులు, విద్యార్థినులు ప్రయాణించారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రారంభించింది.
అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి అర్పించి..
అసెంబ్లీ నుంచి బస్సులో ట్యాంక్‌బండ్ వరకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు, అధికారులు.. అక్కడ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత సీఎం సహా అందరూ అదే ఆర్టీసీ బస్సులో తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా.. మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ పోస్టర్లను ప్రదర్శించారు.
‘మహాలక్ష్మి’తో మరింత సంతోషం: రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
కొత్త ప్రభుత్వంలో తనకు రవాణాశాఖ దక్కడం సంతోషంగా ఉందని.. తనకు ఆ శాఖను కేటాయించిన తొలిరోజే ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రారంభించటం మరింత సంతోషాన్ని కలిగించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘ఇది గొప్ప పథకం, మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీన్ని అంతా కలసి విజయవంతం చేయాలి.
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఉందన్న ఉద్దేశంతో.. అంతగా అవసరం లేకున్నా బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటే తోటివారికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అవసరమున్న మహిళలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. ఓ రెండు వారాలు దీన్ని సమీక్షిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. నేను కొత్త మంత్రిని అయినందున శాఖపై పూర్తి అవగాహన రావాల్సి ఉంది. త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తాను’’అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించిన ‘చేయూత’పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు ఆరోగ్య భద్రతను కల్పించే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సాయం అందుతుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైద్యపరంగా మొత్తం 1,672 ప్యాకేజీలు అమలుకావడంతోపాటు 21 స్పెషాలిటీ సేవలు అందుతాయని వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment