కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్‌ | CM YS Jagan Fires On Chandrababu Naidu Over TDP Political Alliance, Details Inside | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్‌

Published Tue, May 7 2024 4:40 AM | Last Updated on Tue, May 7 2024 11:44 AM

CM YS Jagan Fires On Chandrababu TDP Political Alliance

రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్‌ ధ్వజం

ఇప్పటికే కొనసాగుతున్న పథకాలనూ అడ్డుకుంటారా? 

ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? 

అక్కచెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు 

నిన్న అవ్వాతాతల పెన్షన్లు.. నేడు ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌పై చంద్రబాబు కుట్రలు 

ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు.. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది 

పేదలకు మంచి చేసే మీ జగన్‌ ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారు 

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం.. అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి 

మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్‌ వినిపించాలి 

నా అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారా? 

మీపై సంస్కార హీనంగా మాట్లాడే వారికి ఓటుతోనే బుద్ధి చెప్పండి 

డ్రగ్స్‌ కంటైనర్‌ బుక్‌ చేసింది వదినమ్మ బంధువులేనని తేలడంతో అందరూ గప్‌చుప్‌ 

లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగేందుకు ఫ్యాను గుర్తుపై రెండు బటన్లు నొక్కండి  

వదినమ్మ బంధువులే...!
ఇవాళ వాళ్ల అబద్ధాలు ఏ స్థాయికి వెళ్లిపోయాయంటే.. కొద్ది వారాల క్రితం ఓ ప్రైవేట్‌ ఆక్వా కంపెనీ కంటైనర్‌లో విశాఖకు ఏకంగా రూ.2లక్షల కోట్ల విలువైన డ్రగ్స్‌ తెచ్చారని, అదంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పనే అంటూ ఇదే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు దుష్ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ కంటైనర్‌ బుక్‌ చేసింది ఎవరంటే... చంద్రబాబు వదినమ్మ బంధువులే. తమవారేనని ఎప్పుడైతే బయటకు వచ్చిందో... అప్పుడు అందరూ గప్‌చుప్‌! అది బయటకు వచ్చేదాకా రూ.రెండు లక్షల కోట్ల డ్రగ్స్‌ అంట... తెచ్చింది వైఎస్సార్‌సీపీ అంట... అని బురద చల్లేయడమే!
– మచిలీపట్నం సభలో సీఎం జగన్‌

ఈసీపై ఒత్తిడి తెచ్చి..
వీళ్ల కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయంటే.. మనం బటన్లు నొక్కిన ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌ను కూడా ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్కచెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. 
– బందరు సభలో సీఎం జగన్‌

జగన్‌ అనే రైతు చల్లిన విత్తనాలు..
జగన్‌ అనే రైతు.. రాష్ట్రం అనే పంటపొలంలో విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలు, మంచి భవిష్యత్తు అనే విత్తనాలను నాటాడు. ఇవాళ్టికి ఐదేళ్లు అయింది. ప్రతి గ్రామం, పట్టణం, సామాజికవర్గాల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. మరో 15 ఏళ్లలో అవి మహా వృక్షాలు అవుతాయి. పిల్లలు క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఐబీ సిలబస్‌ చదువులతో స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్‌ నుంచి 25 శాతం కరిక్యులమ్‌తో డిగ్రీ పూర్తి చేసి ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లు అందుకుంటారు. అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ అత్యుత్తమ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. వారి బతుకులు, పేద కుటుంబాల తలరాతలు మారతాయి. పేదరికం అన్నది మటుమాయం అయిపోతుంది. మీ బిడ్డ ప్రతి ఆలోచనా పేదవాడి బతుకులు ఎలా మార్చాలన్నదే.
– రేపల్లె సభలో సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, నరసరావుపేట/సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల కమిషన్‌ మీద తీవ్ర ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటికే అమలవుతున్న పథకాలను (ఆన్‌ గోయింగ్‌) సైతం అడ్డుకుంటూ పేదలు, రైతులు, మహిళలు, అవ్వాతాతల పట్ల చంద్రబాబు రాక్షసంగా ప్రవర్తిస్తు­న్నారని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గతంలోనే ప్రవేశపెట్టి, కొనసాగు­తున్న పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా కూడా అక్కచెల్లెమ్మల ఖాతాలకు డబ్బులు జమ కాకుండా కావాలనే ఆపుతున్నారని మండిపడ్డారు. 

ప్రజలకు అందాల్సిన మంచికి అడ్డుపడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఇష్టాను­సారంగా అధికారులను మారుస్తున్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. కేవలం పేదలకు మంచి చేసే మీ జగన్‌ ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్నది చాలా అవసరం. అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి. మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్‌ వినిపించాలి’ అని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతు­న్నారంటూ చంద్రబాబు, దత్తపుత్రుడు సంస్కార­హీనంగా, పరమ దుర్మార్గంగా మాట్లా­డుతు­న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి దుష్ప్రచారాలతో రాష్ట్రం పరువు ఏమవుతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర­వ్యాప్తంగా కిరాణా షాపులు నడుపుకొంటున్న అన్నద­మ్ములు, అక్కచెల్లెమ్మలు గంజాయి విక్రయి­స్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పాలని సూచించారు. 

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పైనా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదాలు పెరిగిపో­యి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ టైటిల్‌ ఇన్సూరెన్స్‌తో సంస్కరణ తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి అయిన 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాక్కున్నట్లు చెప్పారా? అని చంద్రబాబు, ఎల్లో మీడియాను నిలదీశారు. 

చంద్రబాబును నమ్మడం అంటే మరో­సారి మోసపోవడం, కొండ చిలువ నోట్లో తలకా­య పెట్టడమేనని ప్రజలను హెచ్చ­రించారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యమ­న్నారు. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా రేపల్లెలో, మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్లలో, సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. మూడు సభల్లో సీఎం ఏమన్నారంటే...

పథకాల విప్లవం.. గడగడా చెబుతా
నాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్‌ స్కూళ్లు, ఇంగ్లిష్‌ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీలు, 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు నుంచి ఏకంగా ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. పిల్లల చేతుల్లో తొలిసారిగా బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ (ద్వి భాషా పాఠ్యపుస్తకాలు) కనిపిస్తున్నాయి. బడులు తెరవ­గానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరు­ముద్ద, పిల్లలను చదివించేలా తల్లులను ప్రోత్సహి­స్తూ అమ్మఒడి లాంటి గొప్ప కార్యక్ర­మాలు జరుగుతు­న్నాయి. ఉన్నత చదువులు అభ్యసించే 93 శాతం మంది విద్యార్థులకు విద్యాదీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం. ఖర్చుల­కు ఇబ్బంది పడకుండా వసతి­దీవెన అందిస్తున్నాం. విద్యారంగంలో ఇలాంటి విప్లవాలు గతంలో ఉన్నాయా?

అక్కచెల్లెమ్మల సాధికారత..
చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో మహిళా సాధికారతపై మీ బిడ్డ చిత్తశుద్ధితో వ్యవహరించాడని గర్వంగా చెబుతున్నా. నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా ఓ ఆసరా, సున్నా­వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు, 22లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. అవ్వా­తాతలు ఇబ్బంది పడకూడదని గతంలో ఏ ప్రభు­త్వమైనా ఆలోచన చేసిన పరిస్థితులు ఉన్నాయా? వారి కష్టాలను గుర్తించి ఇంటికే రూ.3 వేల పెన్షన్, ఇంటివద్దకే పౌర సేవలు, పథకాలు, రేషన్‌ డెలివరీ చేస్తున్నాం.

రైతన్నకు అండగా...
పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్నలకు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పెట్టుబడి సాయంగా రైతుభరోసా, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసే­లోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థ తెచ్చాం. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం∙లాంటివి తీసుకొచ్చాం. పేదలెవరూ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల దాకా ఉచిత వైద్యం అందిస్తూ భరోసా కల్పించాం. కోలుకునే సమయంలో జీవనభృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్, ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్షతో అండగా నిలిచిన ప్రభుత్వాలను గతంలో ఎప్పుడైనా చూశారా?

అవ్వాతాతల పెన్షన్‌ అడ్డుకున్నదీ బాబే
అవ్వాతాతలకు మొన్నటిదాకా ఇంటికే వచ్చిన పెన్షన్‌ను అడ్డుకున్నది ఎవరు? తన మనిషి నిమ్మ­గడ్డ రమేష్‌ ద్వారా సాక్షాత్తూ చంద్రబాబే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయించాడు. వలంటీర్లు ఇంటికి రాకూ­డదంటూ పెన్షన్‌ను అడ్డుకున్నాడు. అవ్వాతాత­లకు ఇచ్చే పెన్షన్‌ను బ్యాంక్‌ అకౌంట్లలో వేయాలని ఎన్ని­క­ల కమిషన్‌తో ఉత్తర్వులు ఇప్పించాడు. అవ్వా­తా­­త­లు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడు­తుంటే ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్‌పై వేస్తున్నాడు.

మన అభ్యర్థులను ఆశీర్వదించండి
బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈవూరి గణేష్, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్, మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బందరు ఎమ్మెల్యే అభ్యర్ధి పేర్ని కిట్టు (కృష్ణమూర్తి),ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావును మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.

మీ కళ్లెదుటే కనిపిస్తున్న విప్లవాలు..
గ్రామంలోనే 600 రకాల సేవలు అందిస్తున్న సచివాలయం, 60–70 ఇళ్లకు వలంటీర్‌ సేవలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్‌ లైబ్రరీలు, మహిళా పోలీస్, దిశ యాప్‌.. లాంటి మన కళ్లెదుటే కనిపిస్తున్న విప్లవాలను ఇంతకు ముందెప్పుడైనా చూశారా? 14 ఏళ్లు అధికారంలో ఉండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికీ ఒక్క మంచి కూడా గుర్తురాదు. 

ఈ ఎన్నికల్లో పేదల శత్రువులంతా.. పేదలకు అండగా నిలబడిన ఒక్క మీ జగన్‌ మీద ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. మళ్లీ వలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్‌ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా,  లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, మన హాస్పిటళ్లు, వ్యవసాయం మెరుగ్గా ఉండాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. మంచి చేసిన ఫ్యాను ఇంట్లో 
ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి.

2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..
⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయా? 
⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా? 
⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా.. ఒక్క రూపాయైనా ఎవరి ఖాతాలోనైనా జమ చేశాడా?
⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? 
⇒ అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? 
⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ జరిగిందా? 
⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? 
⇒ సింగపూర్‌కి మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలలో ఎవరికైనా కనిపిస్తోందా? 
⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. 
⇒ మరోసారి వంచనకే ముగ్గురూ కొత్త మోసాలతో వస్తున్నారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్లు అంటూ నమ్మబలుకుతున్నారు.

గతంలో ఎప్పుడైనా జరిగాయా?
వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లు ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. మీ జగన్‌కు ఓటేస్తే పథకాలు, ఇంటింటి అభివృద్ధి కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. 

చంద్రముఖి మళ్లీ నిద్ర లేచి లకలక లకలకా..
అంటూ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు మీ గడప తొక్కుతుంది. చంద్రబాబుకు ఏ రోజూ మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. సాధ్యం కాని హామీలతో బాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఆయన మోసాలను కళ్లకు కడుతుంది. మరోవైపు అక్కచెల్లెమ్మల బాగు కోసం మీ బిడ్డ 59 నెలల వ్యవధిలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా అందించి 130సార్లు బటన్లు నొక్కాడు. 

రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాడు. ఏ సచివాలయానికి వెళ్లినా నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు 1.31 లక్షల మంది  చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా పోస్టులను భర్తీ చేశాం. ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా?

మన మచిలీపట్నం అభివృద్ధి...
⇒ మన మచిలీపట్నంలో రూ.5,100 కోట్లతో పోర్టు నిర్మాణం వాయువేగంగా జరుగుతోంది. దీన్ని సాయంత్రం అలా వెళ్లినప్పుడు మీరే చూస్తున్నారు. 
⇒ ఇదే మచిలీపట్నంలో రూ.550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది మీ బిడ్డ పాలనలోనే. 
⇒ ఇదే బందరులో పక్కనే రూ.350 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌తో  ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరంటే మీ బిడ్డ జగన్‌. 
⇒ ఈ ప్రాంతంలో భూముల సమస్యను పరిష్కరించింది ఎవరు? ఎవరు ఉంటే  సమస్యలు పరిష్కారం అవుతాయో ఆలోచించండి. అన్నింటికీ సొల్యూషన్‌ మీ జగన్‌. 
⇒ నాని ఇప్పుడే చెబుతున్నాడు.. బందరు తీర ప్రాంతంలోని 14 గ్రామాల్లో 30–40 ఏళ్లుగా భూములను అనుభవిస్తున్న పేద రైతులకు భూ హక్కులు కల్పించే ఫైల్‌ను చంద్రబాబు ఆపారు. మళ్లీ మీ బిడ్డ గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే బందరుకు వచ్చి అవే భూములు మీ అందరికీ పంచిపెడతాడని హామీ ఇస్తున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement