సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేదా? అన్న సందిగ్ధత ఏర్పడుతోంది. సీపీఐ విషయంలో స్పష్టత వచ్చినా, సీపీఎంకిస్తామన్న రెండుస్థానాల్లో మిర్యాలగూడ ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. వైరా స్థానంపై ఎటూ తేల్చకపోవడంతో ఆదివారం సీన్ మారిపోయింది. వైరా ఇవ్వనిపక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని సీపీఎం స్పష్టం చేసింది. కాంగ్రెస్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో అసలు వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.
సీపీఐ మౌనం..
సీపీఐ, సీపీఎంలకు రెండేసి చొప్పున అసెంబ్లీ స్థా నాలు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అయితే వామపక్షాలు కోరుకున్న విధంగా స్థానాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కోరగా, కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించింది. సీపీఎం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలు ఇవ్వాలని కోరగా మిర్యాలగూడ మాత్రమే సాధ్యమవుతుందని, మిగిలిన రెండింటిలో ఏ సీటూ ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఆ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది.
దీంతో వైరా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు భావించినా ఒక్కరోజులో పరిస్థితి మారింది. తాజా పరిణామాలపై సీపీఐ మౌనంగా ఉంది. ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాగా ముందు ప్రకటించిన చెన్నూరు స్థానం కూడా సీపీఐకి కేటాయించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. అదే నిజమైతే సీపీఐ వైఖరి కూడా మారే అవకాశముందని చెబుతున్నారు. ఒక వేళ చెన్నూరు ఖరారైతే కాంగ్రెస్‌తో ముందుకు వెళుతుందా? సీపీఎంతో ముడిపెడుతుందా? అనే చర్చ జరుగుతోంది.
సహకారంపై సందేహాలు
పొత్తు కుదిరినా కాంగ్రెస్ ఏమేరకు సహకరిస్తుందోనన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే మిర్యాలగూడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని ఆ పార్టీ అనధికారికంగా ప్రోత్సహిస్తోందని సీపీఎం వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెంలోనూ అలాంటి పరిస్థితే నెలకొందని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగైతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించకూడదనే షరతును కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment