హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజులే సమయం ఉండటంతో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా సాగుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్ని కల్లో మెరుగైన ప్రదర్శనతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. మిత్రపక్షాలను కలుపుకొని రాష్ట్రాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ ఆలోచనలకు పదును పెడుతోంది.
ఈ క్రమంలో రాష్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో పొత్తులపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆప్‌తో తొలి భేటీ అయ్యింది. అయితే ఆప్ దాదాపు 20 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు 20 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అగ్రనేత ఒకరు జాబితాను కాంగ్రెస్‌కు అందించినట్లు సమాచారం.
అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కనబర్చిన మెరుగైన పనితీరు ఆధారంగా ఆప్ 20 సీట్లు డిమాండ్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని వల్ల తమకు అసెంబ్లీ సీట్లలో దామాషా వాటా దక్కుతుందని ఆప్ విశ్వసిస్తోంది. కానీ ఇందుకు కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ వెనుకాడుతోంది.
ఇక అధికార బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఆప్‌తో పొత్తుకు సుముఖంగా ఉన్న హస్తం.. మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై మాత్రం నిర్ణయం తీసుకోవడం సవాల్‌గా మారింది.
అయితే కూటమిలో భాగంగా ఆప్‌కు ఎన్ని సీట్లను కేటాయించాలన్న ప్రతిపాదనతో తిరిగి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. పార్టీ నాయకులను కోరినట్లు సమాచారం.కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment