![Congress Govt Focus on nominee after On Praja Palana: Revanth Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/2/CONGRESS%202.jpg.webp?itok=cMZtDcO_)
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ఖరారు చేసే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. మొదటి నుంచీ చర్చ జరుగుతున్న విధంగా సంక్రాంతి లోపు మొదటి దఫా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు తనను కలిసిన విలేకరులతో సీఎం రేవంత్ ఈ మేరకు తన మనసులో మాట చెప్పారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో తనతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో పలుకుబడి పనిచేయవని, పార్టీ కోసం కష్టపడ్డవారికి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా త్యాగం చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.
తీవ్ర పోటీ
పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకుని ఆరో తేదీ తర్వాత ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపి అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత సంక్రాంతిలోపు ఈ పదవుల పందేరంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, పదేళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది.
రాజకీయంగా గుర్తింపు ఉండే కీలక కార్పొరేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత తయారయింది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా సీఎం రేవంత్ ఈ పోస్టులపై మరింత స్పష్టత ఇస్తారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment