మిర్చి రైతులతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం: వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామంలో గురువారం రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన ఆయన హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు.
గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ మిర్చి రైతుల కష్టాలు, కూలీలు సమస్యలు వినడంతో పాటు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రధాని, కేంద్రమంత్రి అమిత్‌షా కలిసి దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఏ కాయ కష్టం చేయకుండానే అంబానీ, అదానీలు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని భట్టి ప్రశ్నించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం లౌకిక వాదాన్ని పక్కకు పెట్టి మతం పేరిట ప్రజలను విడగొట్టి వైషమ్యాలను పెంచుతూ లబ్ధికి యత్నిస్తోందని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment