
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో జైలు శిక్ష ఖరారు, ఎంపీ పదవికి ఎసరు రావడంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. కాషాయ దళం కావాలని తమ నాయకుడిని టార్గెట్ చేసిందని హస్తం పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ తన ట్విటర్ హ్యాండిల్ బయోను మార్చారు. అంతకుముందు ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ ఉన్నచోట ‘డిస్ 'క్వాలిఫైడ్ ఎంపీ’ (Dis'Qualified MP) అని అప్‌డేట్ చేశారు.
కాగా, ప్రధాని మోదీపై విమర్శలు చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరిచారంటూ దాఖలైన పరువునష్టం దావాలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరునాడే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌ని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఖాళీగా ఉందని ప్రకటించింది.
తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అప్పీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొంది. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! ఇదిలాఉండగా, పరువునష్టం కేసులో జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎగువ న్యాయస్థానాలను ఆశ్రయించనుంది.
(చదవండి: ఆ ఎమ్మెల్యే ఇంటిపేరు మోదీ కాదు, భూత్‌వాలా)
దేశవ్యాప్త ఆందోళనలు..
రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పార్టీ కీలక నేతలు ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో ‘సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష’కు చేపట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అణగారిన వర్గాల కోసం రాహుల్ గాంధీ పనిచేస్తుంటే బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. రాహుల్ కర్ణాటక ఎన్నికల ర్యాలీలో మాట్లాడితే కేసు గుజరాత్‌కు వెళ్లిందని విమర్శించారు. కర్ణాటకలోని బీజేపీ సర్కార్‌కు ఆ రాష్ట్రంలో కేసు వేసేంత దమ్ము లేదా? అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని బీజేపీ శ్రేణులు కావాలనే కించపరుస్తున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు)
Comments
Please login to add a commentAdd a comment