అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్‌ వర్గంపై కాంగ్రెస్‌ నేత తీవ్ర విమర్శలు | Congress Leader Sanjay Nirupam Calls Uddhav Shiv Sena Candidate Khichdi Chor Amid Rift, See Details - Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్‌ వర్గంపై కాంగ్రెస్‌ నేత తీవ్ర విమర్శలు

Published Wed, Mar 27 2024 4:29 PM | Last Updated on Wed, Mar 27 2024 5:10 PM

Congress Leader Sanjay Nirupam calls Uddhav candidate khichdi chor - Sakshi

ముంబై: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శివసేన (ఉద్దవ్‌ వర్గం)పై కాంగ్రెస్‌ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ నిరుపమ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. శివసేన వాయువ్య ముంబై అభ్యర్ధిని కిచిడీ ఛోర్ అంటూ మండిపడ్డారు. 

కాగా మహా వికాస్‌ అఘాడి కూటమిలో, ఎన్సీపీ(శరద్‌చంద్ర పవార్‌), కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో శివసేన బుధవారం 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్‌ కూడా పట్టుబడుతున్న ముంబై సౌత్‌ సెంట్రల్‌ స్థానాన్ని అనిల్‌ దేశాయ్‌కి కేటాయించింది. వాయువ్య ముంబై నుంచి ఎంపీ గంజనన్‌ కీర్తికర్‌ కుమారుడు అమోల్‌ను శివసేన పోటీలోకి దింపింది.

ఈ విషయంపై నిరుపమ్ స్పందిస్తూ.. అమోల్‌కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముంబై నార్త్-వెస్ట్ స్థానానికి అమోల్ కీర్తికర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం కూటమి ధర్మ ఉల్లంఘనగా పేర్కొన్నారు. శిసేన అభ్యర్థిని ‘కిచిడి చోర్‌గా అభివర్ణించారు. అలాంటి వారి కోసం తాము పనిచేయమని పేర్కొన్నారు.

‘ముంబైలోని ఆరు లోక్‌ సభ స్థానాల్లో అయిదు చోట్ల శివసేన పోటీ చేస్తుంది. కేవలం ఒక సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది. దీన్ని బట్టి ముంబైలో కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు శివసేన ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉండకూడదు.  దీని వల్ల కాంగ్రెస్‌కు భారీ నష్టం జరుగుతుంది.

ఈ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం జోక్యం చేసుకోవాలి. లేకపోతే శివసేనతో పొత్తు విరమించుకునే ఆలోచన చేయాలి. ఒకవేళ శివసేన తాము ఒంటరిగా పోరాడగలమని  భావిస్తే అది తమ అతిపెద్ద తప్పు. శివసేన ఇలా జాబితాను ప్రకటించడం కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నిర్ణయం కోసం వారం రోజులు వేచిచూస్తా. ఆ తర్వాత తను చేయాల్సింది చేస్తా’ నని పేర్కొన్నారు.
చదవండి: లిక్కర్‌ స్కాం కేసు: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు..

కిచిడీ స్కామ్‌లో అమోల్‌కు  సమన్లు
అయితే శివసేన టికెట్‌ ఇచ్చిన అమోల్‌కు కిచిడీ కుంభకోణంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ కుంభకోణం విచారణలో భాగంగా తాజాగా చర్యలు చేపట్టింది.

ఇక మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్‌ 16, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈలోపే శివసేన బుధవారం 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. అంతేగాక తమ పార్టీ 22 చోట్ల పోటీ చేయనున్నట్లు సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement