న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని బిహార్ నటుడి మృతిగా ప్రచారం చేస్తూ బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు రాబట్టుకునేందుకు ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ’పేరిట బీజేపీ బిహార్ విభాగం బ్యానర్లు, పోస్టర్లు విడుదల చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇండియన్ యాక్టర్. కానీ ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ఆయనను బిహార్ నటుడిగా మార్చివేసింది’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. అదే విధంగా సుశాంత్ మృతి కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న తీరును అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. (చదవండి: బలవంతంగా ఒప్పించారు: రియా )
ఈ మేరకు.. ‘‘ పొలిటికల్ మాస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. సముద్రాన్ని మధించి మకరందానికి బదులు మాదక ద్రవ్యాలను కనుగొన్నాయి. అసలైన హంతకుడిని పట్టుకునేందుకు ఇప్పటికీ చీకట్లో వారి వెదుకులాట కొనసాగుతూనే ఉంది’’అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రియా చక్రవర్తిని ఎన్డీపీఎస్ చట్టం(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెన్)కింద అరెస్టు చేయడాన్ని ఒక మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇక మరో ట్వీట్‌లో..‘‘రియా తండ్రి మాజీ ఆర్మీ అధికారి. ఆయన దేశానికి సేవ చేశారు. రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం చేయడాన్ని బిహారీకి న్యాయం చేసినట్లుగా చిత్రీకరించడం సరికాదు’’ అంటూ ప్రత్యర్థి పార్టీని విమర్శిస్తూనే రియా బెంగాలీ అంటూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా కొత్తగా ఎన్నికైన అధీర్ రంజన్ చౌదరి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు. (చదవండి: ‘బిహార్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం’)
అదే విధంగా సుశాంత్ కేసులో ‘మీడియా విచారణ’ న్యాయ వ్యవస్థకు అరిష్టంగా దాపురిచిందంటూ మండిపడ్డారు. కాగా సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేమపేరిట తన కొడుకును మోసం చేసి, అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈడీ ఎదుట రియా విచారణకు హాజరయ్యారు. అంతేగాక సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బిహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే.
Rhea's father is a former military officer, served the nation. Rhea is a Bengalee Brahmin lady, justice to actor sushant rajput should not be interpreted as a justice to Bihari.#SushantSinghRajputCase
— Adhir Chowdhury (@adhirrcinc) September 9, 2020
(4/n)
Comments
Please login to add a commentAdd a comment