లక్నో: భారత్ జోడో యాత్ర చేబడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు ఉత్తర్‌ప్రదేశ్ పార్టీ నూతన అధ్యక్షుడు బ్రిజ్‌లాల్ ఖబ్రీ. రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్ అని నినదించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్ర చేబడుతున్నారని నొక్కి చెప్పారు. యూపీసీసీ అధ‍్యక్షుడిగా ఎన్నికైన క్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దేవ్ కాంత్ బరూవా పాపులర్ డైలాగ్ ‘ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా’ను ఉద్ఘాటించారు. ఈ నినాదాన్ని తరుచుగా ప్రత్యర్థులు ఉపయోగిస్తూ కాంగ్రెస్ పార్టీ, గాంధీలపై విమర్శలు చేస్తుంటారు.
ఎన్నికల పరంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం ఒకే ఒక్క జిల్లా బులంద్‌షహర్‌లో మాత్రమే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టటంపై ప్రశ్నించగా.. వివరణ ఇచ్చారు ఖబ్రీ. ‘భారత్ అంటే ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు. రాష్ట్రాల సమహారం. రాహుల్ 13 రాష్ట్రాల‍్లో యాత్ర చేస్తారు. ఆయనకు పెద్ద లక్ష‍్యం ఉంది. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసి రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో యూపీ మొత్తం 80 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బరేలీ, అమేఠీల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోతుంది. దేశాన్ని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ పాదయాత్ర చేస్తే కొందరికి కడుపు మంట ఎందుకు వస్తోంది? లక్షల మంది రాహుల్‌తో కలిసి నడుస్తున్నారు. రాహుల్ అంటే భారత్, భారత్ అంటే రాహుల్ అని చెప్పగలను.’ అని పేర్కొన్నారు ఖబ్రీ.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటంపై సంతోషం వ్యక్తం చేశారు ఖబ్రీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహాలను క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం స్థానాలను గెలవాలనే లక్ష‍్యంగా పని చేస్తామన్నారు.
ఇదీ చదవండి: కార్పొరేట్లకు కాదు, గుత్తాధిపత్యాలకే వ్యతిరేకం
Comments
Please login to add a commentAdd a comment