
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పని విభజన జరిగింది. కొత్తగా నియమితులైన వర్కింగ్‌ప్రెసిడెంట్లకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు 3 నుంచి 4 ఎంపీ స్థానాలతోపాటు పలు అనుబంధ సంఘాలను పర్యవేక్షించి సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించారు. ఆయా నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటు నేతలను సమన్వయం చేసే బాధ్యతలు, అనుబంధ సంఘాలు, విభాగాల పర్యవేక్షణనూ వర్కింగ్ ప్రెసిడెంట్లకే అప్పగించారు. ఇందులో గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్‌కు మార్‌గౌడ్‌లకు మూడు లోక్‌సభ, అంజన్‌కుమార్, జగ్గారెడ్డిలకు 4 స్థానాల చొప్పున కేటాయించారు. మహిళా కాంగ్రెస్ పర్యవేక్షణ జగ్గారెడ్డికి, ఎన్‌ఎస్ యూఐ బాధ్యతలను గీతారెడ్డికి ఇచ్చారు.
మహిళా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఏర్పాటు
తెలంగాణ మహిళా కాంగ్రెస్ కొత్త కార్యవర్గాన్ని జాతీయ కమిటీ ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సునీతారావు నేతృత్వంలోని కొత్త టీమ్‌ను ప్రకటిస్తూ ఆలిండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి ఫాతిమా రోస్నా మంగళవారం ఉత్తర్వు లు జారీచేశారు. 14 మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 13 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 12 మందిని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. అలాగే 21 జిల్లాలకు అధ్యక్షురాళ్లనూ ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సదాలక్ష్మి(రంగారెడ్డి), జి.రేణుక, మార పల్లి నాగరాణి(నల్లగొండ), ఎ.చంద్రకళ (సిరిసిల్ల), ఎం.వరలక్ష్మి, ఎ.కల్పనారెడ్డి, దుర్గారాణి, జమీలాబేగం (మేడ్చల్), సి.పద్మాయాదవ్ (కరీంనగర్), ఎస్.లావణ్య (నిజామాబాద్), బి.రజిత (సిద్దిపేట), పి.విజయలక్ష్మి (కొత్తగూడెం), ఎస్తేర్‌రాణి, షమీమ్ ఆగా (హైదరాబాద్)ను నియమించారు.
‘ఇంద్రవెల్లి దండోరా’పై కాంగ్రెస్ నగారా
పార్టీ నేతలతో జగ్గారెడ్డి ప్రత్యేక భేటీ
ఇంద్రవెల్లి వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మోగించనున్న ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగసభ కోసం కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. 9న నిర్వహించే ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ నివాసంలో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఇంద్రవెల్లిలో 18 ఎకరాల స్థలం లీజుకు తీసుకుని సభాస్థలి ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన అతిపెద్ద సభగా ‘ఇంద్రవెల్లి దండోరా’ను విజయవంతం చేయాలని నిర్ణయించారు. జనసమీకరణపై చర్చించిన నేతలు ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్, ఖానాపూర్, కడెం, జెన్నారం, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ముధోల్, నిర్మల్ ప్రాంతాల నుంచి దళిత, గిరిజనులను తరలించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment