జనం సొమ్ముతో వైభవంగా అంబానీ కుమారుడి పెళ్లి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపాటు
సోనిపట్: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ సర్కారు కేవలం కొద్దిమంది ధనవంతుల సేవలో తరిస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అంబానీకి, అదానీకి మేలు చేయడానికే ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలు తీసుకొచ్చినట్లు హరియాణాలో ఓ వ్యాపారి తనతో చెప్పాడని అన్నారు. మంగళవారం హరియాణాలోని సోనిపట్, బహదూర్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
‘‘ఇటీవల జరిగిన అంబానీ కుమారుడి పెళ్లి చూశారా? ఈ పెళ్లి కోసం అంబానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్మంతా ఎవరిది. అది ముమ్మాటికీ ప్రజలదే. మీ బిడ్డల పెళ్లి చేయాలంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ రైతు తన బిడ్డ పెళ్లి జరిపించాలంటే అప్పులపాలు కావాల్సిందే. కానీ, దేశంలో పిడికెడు మంది బడా బాబులు పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చుచేసేలా వారికి అనుకూలంగా నరేంద్ర మోదీ ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంపన్నుల సేవలో ఆయన తరిస్తున్నారు.
ఇది రాజ్యాంగంపై దాడి కాక మరేమిటి?’’ అని నిలదీశారు. ఇద్దరు ముగ్గురు శ్రీమంతుల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వం, హరియాణాలో బీజేపీ ప్రభుత్వం పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అంబానీ, అదానీ పేర్లే కనిపిస్తున్నాయని ఆక్షేపించారు. రక్షణ రంగ బడ్జెట్‌ను అదానీకి కట్టబెట్టడానికి అగ్నిపాథ్ పథకం తీసుకొచ్చారని ఆరోపించారు. రక్షణ శాఖకు విక్రయిస్తున్న ఆయుధాలపై అదానీ కంపెనీ సొంత స్టిక్కర్లు వేసుకుంటోందని, వాస్తవానికి వాటిని విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment