న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్పీడప్ చేసింది అధిష్టానం. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ వార్ రూమ్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశం మూడు గంటలుగా సాగుతోంది. ఈ భేటీలో అభ్యర్ధుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. ఒకేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
సమావేశానికి జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధిక్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, భట్టి విక్రమార్క. హాజరయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి ఆ నివేదికను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ తీసుకొచ్చింది. 119 నియోజకవర్గాలకు దాదాపు 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిఫారసు చేసింది.
కాగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధవారం కూడా భేటీ అయ్యింది. రెండున్నర గంటల పాటు అభ్యర్థులపై కసరత్తు చేశారు. అయితే నిన్న లోక్‌సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ కారణంగా అర్థాంతరంగా సమావేశం నిలిచిపోయింది. నేటి రోజు సమావేశంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కిరానుంది.
హైదరాబాద్: మరోవైపు హైదరాబాద్‌లో గాంధీ భవన్లో శ్రీధర్ బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలపైనా కమిటీ కసరత్తు చేసింది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, కేటీఆర్..హరీష్ రావు ఎప్పుడొస్తారో చెబితే కర్ణాటక అంతా తిప్పి ఆ అమలును చూపిస్తామంటూ శ్రీధర్ బాబు సవాల్ విసిరారు.
‘‘కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం.. మేము హామీ ఇచ్చామంటే అమలు చేసి తీరుతాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రజలు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారో అలాంటి హామీలు ఇస్తాం. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తాం. జిల్లాలు, నియోజక వర్గాలలో కూడా అక్కడి ప్రత్యేక అంశాలతో స్థానిక మేనిఫెస్టో లు రూపొందిస్తాం. మెగా డిఎస్సి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 13,500 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సి వేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అని శ్రీధర్ బాబు తెలిపారు.
చదవండి: ‘కాంగ్రెస్ నాయకురాలికి డబుల్ ఇల్లు ఇచ్చాం.. ఇప్పుడేమంటారు’
Comments
Please login to add a commentAdd a comment