
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన సమరశంఖం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీలపై నిరసనలతోపాటు టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేశాకే పరీక్షల నిర్వహణ, పేపర్ల లీక్ కేసులో సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్న డిమాండ్లతో నిరుద్యోగులతో కలసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈనెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కేంద్రంగా పోరాటం ప్రారంభించనుంది. ఎంజీ వర్సిటీ విద్యార్థులతో కలసి నిరసన చేపట్టిన అనంతరం.. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ నిరుద్యోగ సభలు నిర్వహించనుంది. ఈ మూడు జిల్లాల్లో కార్యక్రమాల అనంతరం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో భారీగా నిరుద్యోగ సభ నిర్వహించాలని.. దానికి కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంకాగాంధీని ఆహా్వనించాలని నిర్ణయించింది.
మే నెల మొదటి వారంలో..
ఈనెల 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్‌లో సభ నిర్వహించిన తర్వాత మే 4న, లేదా 5న సరూర్‌నగర్ సభ జరపాలని కాంగ్రెస్ భావిస్తోంది. సభ రోజున తొలుత ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పించి.. అక్కడి నుంచి ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకోవాలని నిర్ణయించింది. ప్రియాంకాగాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారా? నేరుగా సరూర్‌నగర్ సభకు హాజరవుతారా? ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కు వస్తారు? 4, 5 తేదీల్లో ఏ రోజున సభ జరుగుతుందన్న అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ బిజీగా ఉన్నారని.. ఆమె వీలును ఒకరోజు ఇక్కడికి వస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం ఏం చేస్తామనే అంశాలను ఆమె సభలో ప్రకటిస్తారని పేర్కొన్నాయి. ఇక సరూర్‌నగర్ సభ తర్వాత నాలుగైదు రోజుల విరామం తర్వాత మే 9 నుంచి రేవంత్‌రెడ్డి రెండో విడత హాథ్‌సే హాథ్ జోడో యాత్రను జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. మంగళవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ ఈ వివరాలను వెల్లడించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు: రేవంత్
‘‘టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో నిరసన వ్యక్తం చేసిన ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులను ఐదు రోజులు జైల్లో పెట్టారు. అదే టెన్త్ పేపర్లు లీక్ చేశాడంటూ పెద్ద పెద్ద సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేసిన బండి సంజయ్‌కు మాత్రం తెల్లారేసరికి బెయిల్ వచి్చంది. ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ తీవ్రంగా పోరాడిన తర్వాత.. బీజేపీ ఏదో ఒక చిల్లర పంచాయితీ చేస్తుంది. దాన్ని పెద్దది చేయడంలో బీఆర్‌ఎస్ సహకరిస్తుంది. సంజయ్ అరెస్టు, వెంటనే బెయిల్ దీనికి నిదర్శనం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కుమ్మక్కుకు ఇదే ఉదాహరణ’’అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇంటికో ఉద్యోగమిస్తామని కేసీఆర్ మోసం చేశారని.. ఒకేరోజు 2లక్షల ఉద్యోగాలిస్తామని బండి సంజయ్ మోసపు మాటలు మాట్లాడుతున్నారని.. నిరుద్యోగుల పక్షాన క్షేత్రస్థాయి నుంచి పార్లమెంటు వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. సంజయ్ మాటలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని.. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయో ఆయనకు తెలుసా? అని రేవంత్ ఎద్దేవా చేశారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులంతా కలసి రావాలి..
దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని రేవంత్ మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. తాను పార్లమెంటులో ఈ విషయమై ప్రశ్న అడిగితే.. ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 22 కోట్ల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని వివరించారు. తాము చేస్తున్న పోరాటం కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. 50లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. తమ పోరాటాల్లో విద్యార్థులు సామాజిక బాధ్యతగా పాల్గొనాలని.. నిరసన దీక్షల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
చదవండి: ఇక కమలనాథుల యాత్రల జాతర