సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి విడిపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను వచ్చే ఎన్నికల్లో తమతో కలుపుకోవడంపై కాంగ్రెస్ పారీ్ట ఊగిసలాటలో ఉంది. సీపీఎం, సీపీఐలతో కలసి వెళ్లడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ నేతలు పొత్తులు వద్దనే అభిప్రాయంతో ఉండగా, పార్టీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ భాగస్వాములైన కారణంగా రాష్ట్ర స్థాయిలోనూ దోస్తీ కొనసాగించాలని రెండు పక్షాల హైకమాండ్‌లు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పారీ్టలు కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. కానీ మెజార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలోలా ఓట్ల బదిలీ జరిగే అవకాశం లేదని అందువల్ల ఒంటరి పోటీయే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు.
జాతీయ స్థాయిలోనే ప్రతిపాదనలు
లెఫ్ట్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు వ్యవహారం ఇంకా కింది స్థాయికి రాలేదని, ఇప్పటిరకు ఏఐసీసీ, లెఫ్ట్ పారీ్టల జాతీయ నాయకత్వం స్థాయిలోనే ఈ ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఇరు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నేతలతో ఫోన్‌లో మాట్లాడారని వివరిస్తున్నాయి. ‘వారు మాట్లాడుకున్న తర్వాత వ్యవహారం రాష్ట్ర పారీ్టల వరకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.’ అని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఎన్ని స్థానాల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పారీ్టల ప్రభావం బాగా తగ్గిపోయిందని, 10–15 చోట్ల అంతోఇంతో ఓటుబ్యాంకు ఉందని, నాలుగైదు చోట్ల మాత్రం గెలుపోటములను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.
ఆ ఆరూ.. అసాధ్యమే
ఇతర పార్టీలతో పొత్తు కుదరితే ఏయే అసెంబ్లీ స్థానాలు అడగాలన్న దానిపై సీపీఎం, సీపీఐ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో చర్చించిన అనంతరం ఈ సీట్లపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో సీపీఎం ఉంది. అయితే ఈ ఆరు స్థానాల్లో ఒక్క స్థానం వదులుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మధిర, భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, పాలేరులో గతంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి లాంటి బలమైన నేతలున్నారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో సీపీఎం అడిగే ఈ ఆరుస్థానాల విషయంలోనూ చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
అతికష్టంగా ఆ ఒక్కచోట..!
సీపీఐ ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్లగొండ జిల్లా మునుగోడు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ స్థానాలపై ఆ పార్టీ దృష్టి ఉంది. కాంగ్రెస్‌తో చర్చల్లో ఈ స్థానాలను అడిగే అవకాశాలున్నాయి. అయితే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకీ కాంగ్రెస్ ఇచ్చే అవకాశం లేదు. వైరాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అక్కడ పోటీకి రాందాస్ నాయక్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన విజయాబాయి పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్, హుస్నాబాద్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు బరిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు స్థానాలను వదులుకోవడం కూడా కాంగ్రెస్‌కు కష్టమే. ఇక మిగిలిన మునుగోడులోనే సీపీఐని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మునుగోడులో 2018 ఎన్నికల్లో గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈసారి ఈ స్థానాన్ని పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. అయితే అక్కడ బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశముంది. దీంతో ఒకవేళ ఇస్తే మునుగోడునే సీపీఐకి ఇవ్వాల్సి వస్తుందని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వామపక్షాలతో చర్చలకు వెళ్లి పొత్తు కుదుర్చుకోవాల్సి వస్తే మాత్రం కనీసం చెరో రెండు సీట్లను వదులుకోవాల్సి ఉంటుందని, దానివల్ల పారీ్టకి నష్టమే జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదనేది కొందరి అభిప్రాయంగా ఉంది.
ఆ రెండు సీట్లు అసలు కుదరవు?
ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారథులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం స్థానాలపై పీటముడి పడే అవకాశం ఉందని, ఆ రెండు సీట్లు వదులుకోవడం కాంగ్రెస్ పారీ్టకి సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. పాలేరు, కొత్తగూడెంలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా ఆ రెండు చోట్లా 2018లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందని, అలాంటప్పుడు ఆ సీట్లను ఎలా వదులుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘పొత్తులపై చర్చలు జరిగితే సీపీఐ, సీపీఎంలు ఆ రెండు సీట్లపైనే పట్టుపట్టడం ఖాయం. కానీ మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు స్థానాలు ఇవ్వలేం. అందువల్ల చర్చలకు వెళ్లకపోవడమే మంచిదేమో..’ అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే మేం మెజార్టీ సీట్లు గెలుస్తామని అనుకుంటున్నాం. అక్కడ నాయకత్వం బాగా కష్టపడి పార్టీని నిలబెట్టింది. అలాంటి చోట్ల సీట్లు కమ్యూనిస్టులకు ఇస్తామంటే స్థానిక నాయకత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కాబట్టి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నాం.’ అని మరో ముఖ్యనేత చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment