బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 224 స్థానాలకు గానూ మెజార్టీకి 113 సీట్లు అవసరం కాగా.. కాంగ్రెస్ 135 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది. హస్తం పార్టీ దెబ్బకు 14 మంది బీజేపీ మంత్రులు పరాభవం చవిచూశారు. ఎన్నికల్లో విజయదుందుభి మోగించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశాయి.
మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. ఆ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాగా.. కింగ్ మేకర్ అవుతుందని భావించిన జేడీఎస్ 19 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు.
ఓటింగ్ శాతం ఎంతంటే..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 36 శాతం, జేడీఎస్‌కు 13.3 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఏ పార్టీలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి.
మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. సీఎం అభర్థిని ఖరారు చేసిన అనంతరం సాయంత్రం వెళ్లి గవర్నర్‌ను కలవనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ ఉందని లేఖ అందించనుంది.
కాగా.. కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రేసులో సీనియర్ లీడర్ సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వీరిలో ఒక్కరిని ఖరారు చేయనుంది. సీఎం ఎవరనే విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే నిర్ణయిస్తారని ఇద్దరు నేతలు చెబుతున్నారు. కొన్ని గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కలిసొచ్చిన రాహుల్ భారత్ జోడో యాత్ర..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. ఆయన యాత్ర సాగిన నియోజకవర్గాల్లో 73 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది.
దక్షిణాదిలో వాడిపోయిన కమలం..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయినట్లైంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఏ ప్రభుత్వంలోనూ భాగంగా లేదు. కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో తెంలగాణలోనూ అధికారంపై కాంగ్రెస్ గురిపెట్టింది.
చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే..
Comments
Please login to add a commentAdd a comment