ఏఐసీసీ వర్గాలు చెబుతున్న పేర్లు..
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఆమోదం
ప్రకటన వెలువడక పోవడంతో ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
8 స్థానాలకు పేర్లు ఖరారయ్యాయంటున్న ఏఐసీసీ వర్గాలు
ఐదు స్థానాలకే క్లియరెన్స్ వచ్చిందంటూ గాంధీభవన్ వర్గాల్లో చర్చ
ఒకటి, రెండురోజుల్లో అధికారికంగా జాబితా విడుదల!
ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాలకే అభ్యర్థుల ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. నేతల జనాదరణను పరిగణనలోకి తీసుకుని పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడక పోవడంతో.. ఎన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు, ఎవరెవరికి టికెట్లు లభించాయన్న దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎనిమిది చోట్ల అభ్యర్థులు ఫైనల్ అయ్యారని ఏఐసీసీ వర్గాలు చెబుతుండగా, ఆరు స్థానాలు పరిశీలించినా, ఐదుగురు అభ్యర్థుల ఎంపిక మాత్రమే పూర్తయిందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
సీఈసీ ఆమోద ముద్ర: ఢిల్లీలో మంగళవారం సాయంత్రం సీఈసీ సమావేశం జరిగింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించి పలువురు అభ్యర్థులకు ఆమోదముద్ర వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మంత్రి ఉత్తమ్ సహా కమిటీ ఇతర సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి చర్చ జరిగినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆదివారం ముంబైలో జరిగిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేసిన జాబితాపై చర్చించారు.
13 మందిని ప్రకటించాలనుకున్నా..
తొలి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు జరిపింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం..13 మంది అభ్యర్థుల పేర్లను సీఈసీలో చర్చించి ఒకేసారి ప్రకటించాలని భావించారు. అయితే ఐదు లోక్‌సభ స్థానాలకు ఎక్కువమంది ఆశావహులు ఉండడంతో వాటిపై పీటముడి పడింది. దీంతో అవి మినహా మిగిలిన 8 స్థానాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు.
చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్‌ల పేర్లు పరిగణనలోకి తీసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఖమ్మం, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్, మెదక్ స్థానాలపై ఈ నెల 21న మరోసారి జరుగనున్న సీఈసీ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి.
ఆరు స్థానాలపైనే చర్చ: గాం«దీభవన్ వర్గాలు
గాందీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీఈసీ భేటీలో ఆరు స్థానాలపైనే చర్చ జరిగింది. అయితే ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, ఆదిలాబాద్ నుంచి డా.సుమలతల అభ్యర్థిత్వాలకు సీఈసీ ఆమోదం తెలిపింది.
భువనగిరిపై కూడా చర్చ జరిగినా.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిల్లో ఒకరిని ఖరారు చేయాలా? ఇంకెవరికైనా అవకాశం కల్పించాలా? అన్న దానిపై మరోమారు చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తం మీద బుధవారం అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉందని, కానిపక్షంలో మరుసటి రోజు విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే 8 స్థానాలకు ప్రకటిస్తారా లేక ఐదుకే పరిమితమవుతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment