చదివే పాఠకులకు రచయిత ముందస్తు హెచ్చరిక : సదివి నవ్వినవ్వి సచ్చిపోతే నాదేం పూచీ కాదు
‘ప్రతిపక్షాల ఊహలకు, ఆలోచనలకూ అందకుండా రాజకీయ ఎత్తులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి పులేందుల్లోనే ఓడించేందుకు చంద్రబాబు బ్రహ్మాండమైన ఎత్తు వేశారట.. అని అన్నాడు యాదగిరి.’
‘ఏందిరా కడప కారం దోసెలో సేనిక్కాయల సెట్నీ వేసేది అనుకుంటున్నారా.. అంది ఆది లక్ష్మి.’
‘ఈసారి ఒక్కో మండలంలో పది సుమోలు పెడుతున్నాం మే.. అక్కడ తప్పితే ఇక్కడ.. ఇక్కడ తప్పితే అక్కడ.. ఎలాగైనా మొత్తానికి పులెందుల్లో ఈసారి జగన్‌కు కష్టమే అంటున్నాడు యాదగిరి.’
‘నీ పల్లి చెట్నీలో నా వెల్లిపాయ, అన్నేసి సుమోలు పెట్టడానికి చంద్రబాబు, మీరంతా ట్రావెల్స్ యాపారం స్టార్ట్ చేస్తున్నరా? సరిగా చెప్పుబా అంది ఆదిలక్ష్మి.’
(యాదగిరికి చిర్రెత్తుకొచ్చింది.)
‘ఏంది మే.. నేను సీరియస్‌గా చెప్తానంటే ఎకసెక్కాలు ఆడుతుండావు అని చిరాకు పడ్డాడు యాదగిరి’
‘లేకుంటే ఏందన్నా.. పులెందుల్లో జగనన్నను ఎదుర్కోవడం ఏందీ అన్నా? అక్కడ ప్రచారానికి వచ్చిన మీరు నీళ్లు తాగాలన్నా మా జగనన్న అభిమాని ఇవ్వాల్సిందే. మీకు వేరే ఎవరూ ఇచ్చేది లేదబ్బా అంది ఆదిలక్ష్మి.’
‘దీంతో యాదగిరికి మరింత చికాకు లేచింది. అసలు నీకు తెలుసా.. ఇయ్యాల షర్మిల, సునీత ఇద్దరూ కలిశారు. సేనాసేపు మాట్లాడుకున్నారు తెలుసా అన్నాడు.’
‘అబ్బో ఐతే ఇక మీ కాంగ్రెస్, తెలుగుదేశం ముఠాకు కనీసం 170 సీట్లు వస్తాయన్నట్టేనా అంది ఆదిలక్ష్మి చెరుకు ముక్క తింటూ.’
‘ఏమమ్మా .. నేను అంత సీరియస్ గా చెప్తుంటే ఎటకారమాడతావు అన్నాడు యాదగిరి.’
‘ఆ లేదులేన్నా ..చెప్పు.. ఇద్దరూ కలిసి ఏమేం తిన్నారటా ? ఉగ్గాని బజ్జి.. ఇంకా నెయ్యి దోశె తిని పెద్ద గాలాసు నిండా కాఫీ తాగి, ఈమధ్య వచ్చిన సినిమాల మీద రివ్యూలు మాట్లాడుకున్నారటనా అంది లక్ష్మి.’
‘అది కాదమ్మి ఈసారి పులెందుల నుంచి సునీతక్కాను నిలబెడితే మామూలుగా ఉండదట మావాళ్లు అనుకుంటున్నారు అన్నాడు కాన్ఫిడెంట్‌గా యాదగిరి. ’
‘మామూలుగా ఎందుకు ఉండదురా అంది అదిలక్ష్మి. ఆయమ్మికి మన పులెందుల మొత్తం ఫాలోయింగ్ ఉంది. ఆమె చిటికేస్తే .. అంటూ యాదగిరి కూడా చిటికేయబోయాడు.. కానీ సౌండ్ రాలేదు.’
‘వెంటనే ఆదిలక్ష్మి చెరకు పిప్పిని తుపుక్కున ఊసేస్తూ.. ఆ చిటికేస్తే ఇప్పుడు నువ్వేసినట్లే తుస్సుమంటుందా.. ఆయమ్మి నాన్న వివేకం సార్ పోటీ చేస్తేనే చిత్తుగా ఓడిపోయాడు. ఇప్పుడీయమ్మి వచ్చి ఎందుకు బదనాం అవుద్దిరా అన్న అన్నది ఆదిలక్ష్మి.’
‘ఎహె.. నీకు తెలీదులే వాళ్ళ వెనకమాల చంద్రబాబు అలియాస్ చాణక్యుడు ఉన్నాడు అన్నాడు. సర్లేన్నా సునీతతో బాటు ఇంకో పని చేయండి. అలాగైతే ఇక మీకు తిరుగుండదు అంది ఆమె. చెప్పక్కా నీ ఐడియా బాగుంటే మాత్రం నీకు నక్కిలేసు గొలుసు కొనిస్తా అన్నాడు.’
‘ఏందిరో సీమ నుంచి ఏకంగా శ్రీకాకుళం పోయావు అంటూనే.. రాసుకోరా... బంగారంలాంటి ఐడియా మళ్ళా మళ్ళా రాదు అంది.. బల్ల మీద కూర్చుంటూ. ’
‘సరేక్కా చెప్పు....అన్నాడు...’
‘పులెందుల నుంచి సునీతక్క...కడపనుంచి షర్మిలక్క జమ్మలమడుగు నుంచి నర్రెడ్డి రాజశేఖర్ అన్న పొద్దుటూరు నుంచి అనీల్ అన్న దస్తగిరి కూడా మైదుకూరు ఇచ్చేయండి.. సెటిల్‌మెంట్స్ బాగా చేస్తాడు కాబట్టి ఓ లచ్చ ఓట్లు తేవడం పెద్ద కష్టం కాదులే.. బద్వేలులో కూడా దస్తగిరి తాలూకా వాళ్ళను పెట్టండి.. గెలుపు పక్కా’
‘ఇక కమలాపురం.. రాజంపేట.. ఇక్కడ కూడా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి అయన బామ్మర్దులకు ఇచ్చేస్తే హోల్ మొత్తం కడపంతా మీ చంకలో ఉన్నట్లుంటుంది. ఏమంటావ్ అంది ఆదిలక్ష్మి.. చెరుకు ముక్క విరుస్తూ.. యాదగిరి మొహం మాడిపోయింది.. వాడు ఏదో చెప్పబోయేలోపు.. ఒరేయ్ అన్నా కడప ఎంపీగా మాత్రం నువ్వే చేయాలి.. ఇన్నోటు తెలివితేటలున్న నువ్వుకాకుండా ఇంకెవరు చేస్తారు.. మీ తెలివి తగలెయ్య.. ఇంకో తూరి కడప, పులెందుల అంటూ ఇటు వస్తే ఊరకుక్కలతో కర్పిస్తా. ముందు మీ చాణక్యుడు కుప్పంలో ఓడిపోతాడట. నిన్ననే పెద్దిరెడ్డన్న గట్టిగా ఛాలెంజ్ చేసాడు. ముందు ఆ గోచీ ఊడిపోకుండా బాబును చూసుకోమను అంటూ వెంట తరిమింది ఆది లక్ష్మి.’
(‘దెబ్బకు యాదగిరి పరార్.. ’)
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment