A Conspiracy To Cover Up The Truth Behind The Assassination Attempt On YS Jagan - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: కప్పిపుచ్చడమే..అసలైన కుట్ర!

Published Sat, Apr 15 2023 5:57 AM | Last Updated on Sat, Apr 15 2023 8:45 AM

A conspiracy to cover up the truth behind the assassination attempt on YS Jagan - Sakshi

మొదటి నుంచీ అంతే!!. 2018 అక్టోబర్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన రోజునే... అటు ‘ఈనాడు’ గానీ... ఇటు తెలుగుదేశం పార్టీ గానీ సిగ్గూ ఎగ్గూ వదిలేశాయి. హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుపై తన స్వస్థలం ముమ్మిడివరంలో ఎలాంటి కేసులూ లేవంటూ రామోజీరావు తొలిరోజునే సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. కానీ రెండవరోజున అప్పటి వైజాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. నిందితుడిపై ముమ్మిడివరం  పోలీస్‌స్టేషన్లో నమోదైన రెండు కేసుల్ని వివరించారు. తప్పనిసరై దాన్ని కూడా ప్రచురించింది ‘ఈనాడు’.

ఇక్కడ గమనించాల్సింది... ప్రశ్నించాల్సింది ఒక్కటే. తొలిరోజున ఏ పోలీస్‌ అధికారీ చెప్పకుండానే... ‘ఈనాడు’ తనంతట తానుగా నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని ఎలా ప్రచురించింది? అసలెందుకు ప్రచురించిందీ వార్త? ఎందుకంటే ఇదంతా రామోజీ, చంద్రబాబు కలిసి ఆడించిన కుట్ర కాబట్టి!. తాజాగా ఎన్‌ఐఏ వేసిన కౌంటర్‌కు తన సొంత భాష్యం చెబుతూ శుక్రవారం ‘ఈనాడు’ రాసిన వార్త... ఈ కుట్రను మరోసారి స్పష్టంగా బయటపెట్టింది.అంతే!. 


కోర్టుకు ఎన్‌ఐఏ సమర్పించిన అఫిడవిట్‌లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం


జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్‌ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్‌)

ఏది నిజం ?
వాస్తవానికి సంఘటన జరిగిననాడే ‘ఈనాడు’ ఏడెనిమిది వార్తలు వేసింది. అందులో ఒక్కటి మాత్రమే దాడికి సంబంధించినది. మిగిలినవన్నీ ఆ దాడితో తెలుగుదేశానికి సంబంధం లేదంటూ ఎదురుదాడి చేసినవే. ఆ రోజు మొదలు... ప్రతిరోజూ ఈ కేసును తప్పుదోవ పట్టించే వార్తలే. కాకపోతే ఈ కేసును దర్యాప్తు చేసిన ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) 2019 జనవరి 23న దీనిపై ఛార్జిషీట్‌ వేసింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యకు ప్రయ­త్నించటం వెనక కుట్ర కోణం ఉన్నట్లు ఎన్‌ఐఏ ఆ ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొంది. ఆ దిశగా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పింది. ఇలాంటి సమయంలో న్యాయస్థానాలు అయితే ఆ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని అభియోగాలు నమోదు చేయటం... లేకపోతే తదుపరి దర్యాప్తు కొనసాగించి తుది ఛార్జిషీటు వేయాలని చెప్పటం చేస్తాయి.

ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాలని ఎన్‌ఐఏకు కోర్టు చెప్పింది. కాకపోతే ఏళ్లు గడుస్తున్నా... ఎన్‌ఐఏ తుది ఛార్జిషీటు వేయలేదు. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని తన తొలి ఛార్జి­షీట్లో చెప్పింది కాబట్టి... ఆ కోణాన్ని త్వరగా విచారించి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా ఎన్‌ఐఏను ఆదేశించాలంటూ పిటిషనర్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 

ఆనాడే.. తన స్టేట్‌మెంట్లో.. వివరంగా 
తనపై హత్యాయత్నానికి సంబంధించి 2019 జనవరి 17న నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్యాప్తు అధికారులకు వాంగ్మూలమిచ్చారు. తనపై హత్యాయత్నం వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఆయన బలంగా వినిపించారు. ‘‘నిందితుడెవరో నాకు తెలియదు. కానీ తనను వైఎస్సార్‌ సీపీ అభిమానిగా చూపించటం, దానికి మద్దతుగా ఒక ఫ్లెక్సీని సృష్టించటం ఇదంతా ఓ పెద్ద కుట్రలో భాగం. ఇదంతా తమకు సంబంధం లేని వ్యవహారంగా చిత్రించడానికి టీడీపీ చేస్తున్న కుట్ర.

నా పాదయాత్ర విశాఖలో అడుగుపెట్టిన నాటి నుంచీ హత్యాయత్నం జరిగిన రోజు వరకూ ఎయిర్‌పోర్టులో సీసీ టీవీ కెమెరాలు పనిచేయలేదని నాకు తెలిసింది. పైపెచ్చు నిందితుడికి ఎయిర్‌పోర్టులోని తన ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చిన హర్షవర్దన్‌ చౌదరి టీడీపీ నాయకుడు. 2014లో గాజువాక టిక్కెట్‌ కూడా ఆశించారు. నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని అబద్ధపు డిక్లరేషన్‌ ఇచ్చి మరీ తనను పనిలో పెట్టుకున్నాడు.

‘ఆపరేషన్‌ గరుడ’ పేరిట టీడీపీ సానుభూతిపరుడైన ఓ నటుడు(శివాజీ) ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కూడా ఈ కుట్రలో భాగమేననిపిస్తోంది. వీళ్లు చేసే హత్యాయత్నం ఫలిస్తే వీళ్లనుకున్నది జరుగుతుంది. ఒకవేళ బెడిసికొడితే.. గరుడలో చెప్పిందే జరిగిందని వీళ్లే ఎదురుదాడి చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది’’ అంటూ అప్పట్లో తన స్టేట్‌మెంట్లో వివరంగా చెప్పారు జగన్‌మోహన్‌ రెడ్డి. మరి దీన్ని ఎన్‌ఐఏ ఎందుకు సమగ్రంగా విచారించటం లేదు? ఇదే ఇప్పుడు ప్రశ్న. 

ఇది కుట్ర కాదనగలమా? 
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్‌ ఫ్యూజన్‌ ఫుడ్స్‌లో ఉద్యోగంలో చేరడమే ఈ కుట్రకు నాంది. తదనంతరం జరిగిన పరిణామాలు కుట్రను స్పష్టంగా బయటపెట్టేలా ఉన్నా... ఎన్‌ఐఏ ఉదాసీనంగా ఉండటమే ఇక్కడ విస్మయం కలిగించే అంశం. ఎందుకంటే జె.శ్రీనివాసరావుకు తన రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చేందుకు దాని యజమాని హర్షవర్దన్‌ చౌదరి అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే విమానాశ్రయాల్లో ప్రైవేటు సిబ్బంది నియామకానికి కచ్చి తమైన మార్గదర్శకాలున్నాయి.

(హర్షవర్దన్‌ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను,  ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచి్చన వాంగ్మూలం.)

రెస్టారెంట్, ట్రావెల్‌ ఏజెన్సీల డెస్క్ లు మొదలైన వాటిలో ప్రైవేటు వ్యక్తులే పని చేస్తారు. అందుకోసమే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. నిజానికి జె.శ్రీనివాసరావుపై 2017లో నాటి తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతోపాటు పోలీసులు చార్జ్‌షీట్‌ కూడా వేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. కానీ అతనిపై ఎలాంటి కేసులూ లేవని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి డిక్లరేషన్‌ ఇవ్వటం గమనార్హం.

ఇంకా శ్రీనివాసరావుపై తమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎలాంటి కేసులూ లేవని, స్వస్థలంలో ఉన్నాయేమో చూడాలని విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎన్‌వోసీ ఇచ్చారు. కానీ స్వస్థలంలో కేసుల గురించి కనుక్కునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. దానికితోడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ హర్షవర్దన్‌ చౌదరి తన సొంత ఎన్‌ఓసీ ఇచ్చేశారు. హత్యాయత్నం జరిగిన రోజున రామోజీరావు కూడా శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ ‘ఈనాడు’ ద్వారా ఎన్‌ఓసీ ఇచ్చేశారు. ఇంతటి కీలకమైన అంశంపై ఎన్‌ఐఏ దృష్టిసారించకపోవటమే పలు అనుమానాలకు తావిస్తోంది. 

సీసీ టీవీ రికార్డింగులు ఎందుకు కోర్టుకు సమర్పించలేదు 
ఈ కేసులో విమానాశ్రయంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ అత్యంత కీలకం. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి జె.శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడానికి వాడిన కత్తిని ఎలా తీసుకువెళ్లారన్నది కీలకం. హత్యాయత్నానికి కంటే కొన్ని రోజుల ముందటి సీసీ టీవీ కెమెరాల రికార్డులను ఎన్‌ఐఏ ఆ కెమెరాల తయారీదారైన తోషిబా కంపెనీకి పంపించి విశ్లేషించింది.


విమానాశ్రయం కిచెన్‌లో ఓ వంటపాత్రలో ఆ కత్తిని వేడిచేస్తున్నట్టుగా ఆ వీడియో క్లిప్పింగుల్లో ఉందని వెల్లడైంది. జె.శ్రీనివాసరావే ఆ కత్తిని వేడి నీటిలో మరిగిస్తున్నట్టుగా వీడియో క్లిప్పింగుల్లో ఉంది. మరి ఆ విషయాన్ని ఎన్‌ఐఏ ఎందుకు కౌంటర్‌ అఫిడవిట్‌లో ప్రస్తావించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతటి కీలకమైన వీడియో క్లిప్పింగులను న్యాయస్థానానికి కూడా సమర్పించకపోవడం గమనార్హం. 

నిందితుడి లేఖను కూడాసమర్పించనే లేదు... 
ఈ కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు రాసిన లేఖ, ఇతర కాపీలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఎన్‌ఐఏకు అప్పగించారు. తనకు ఏమైనా అయితే తన శరీర అవయవాలను దానం చేయాలని అతను రాసినట్టుగా ఉంది. తనకు ఏదైనా అవుతుందని జె.శ్రీనివాసరావు ముందే ఎలా ఊహిస్తారు... ! అంటే ఇదేమీ యాదృచ్చి కంగానో అప్పటికప్పుడు హఠాత్తుగానో జరిగింది కాదన్నది సుస్పష్టం. ముందస్తుగానే కొందరితో కలిసి పన్నిన కుట్ర ప్రకారమే అంతా జరిగిందని... ప్లాన్‌తోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని వెల్లడి కావటంలేదా? మరి అంతటి కుట్ర వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా?


నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యూనిఫామ్‌ వేసుకుని, వాటర్‌ బాటిల్‌తో వీఐపీలాంజ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని, అవకాశం దొరికినవెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్‌మోహన్‌రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్‌ఐఏ.  

ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్‌ఐఏ.   

దర్యాప్తు ముగియనే లేదు కదా...!  అంత ఆతృత ఎందుకు రామోజీ? 
హత్యాయత్నం వెనక ఉన్న కుట్రకోణాన్ని త్వరగా దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా ఎన్‌ఐఏను సమాధానమివ్వాలని కోర్టు కోరగా... దీనిపై ఎన్‌ఐఏ కౌంటర్‌ వేసింది. ఇది కౌంటర్‌ మాత్రమే తప్ప తుది ఛార్జిషీటు కాదు. తమ దర్యాప్తు ముగిసిందని కూడా చెప్పలేదు. ఈ కేసులో బాధితుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన అంశాలను కౌంటర్లో ప్రస్తావించింది. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది.

కానీ దర్యాప్తు ముగిసిపోయినట్లు... ఇక దర్యాప్తు చేసేందుకు ఏమీ లేదని అన్నట్టుగా టీడీపీ అనుకూల పచ్చ మీడియా తెగ హడావుడి చేస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నం చేసినట్లు ఎన్‌ఐఏ ఎప్పుడో చెప్పింది. దానికి కారణాలు తేలాలి. ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. కారణాలు తెలిస్తే కుట్ర కోణమూ బయటపడుతుంది. కాకపోతే దర్యాప్తు కొనసాగుతుండగానే... ఇక కుట్ర కోణమేదీ లేదని ఎల్లో మీడియా తేల్చేసింది. ఎన్నాళ్లగానో తాము చేస్తున్న ప్రయత్నం ఫలించినట్లుగా... ఎన్‌ఐఏ కౌంటర్‌ను చూసి ఎల్లో మీడియా తెగ సంబరపడిపోయింది. ఎందుకింత ఆత్రం? దర్యాప్తు పూర్తికాకుండానే ఎందుకంత తొందర రామోజీ? 

ఎల్లో సిండికేట్‌ తీరే అంత... 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఎల్లో సిండికేట్‌ మొదటి నుంచీ వ్యవహరిస్తూ వస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభిమాని అని  ప్రకటించేశారు. కేవలం సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికిపాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించడం అప్పట్లో అందరినీ నివ్వెరపరిచింది.

నిజానిజాలు వెలికితీస్తాం అని ప్రకటించాల్సిన ఆయన... చంద్రబాబు డైరెక్షన్‌ మేరకు అడ్డగోలు అబద్ధాలు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేసే కిందిస్థాయి పోలీసు అధికారులను ప్రభావితం చేసేందుకే ఆయన అలా ప్రకటించారన్నది సుస్పష్టం. వైఎస్‌ జగన్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉండే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ గాయం చిన్నదే అని నాటి డీజీపీ, చంద్రబాబు, ‘ఈనాడు’ కట్టగట్టుకుని ప్రచారం చెయ్యడాన్ని ఏమనుకోవాలి?  

మళ్లీ అదే తతంగం 
ఇక తాజాగా ఎన్‌ఐఏ కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాల విషయంలోనూ ఎల్లో మీడియా ఇదే పంథా ఎంచుకుంది. హత్యాయత్నం వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని నిర్ధారణ అయినట్టుగా కథనాలు ప్రచురించి తన దుర్బుద్ధిని చాటుకుంది. ఎన్‌ఐఏ కౌంటర్‌ అఫిడవిట్‌లోని అంశాలను సవాల్‌ చేస్తూ బాధితుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకోసం న్యాయస్థానం గడువు ఇస్తూ కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

జగన్‌ తరపు న్యాయవాది వేసే కౌంటర్లోని అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నాక విచారణ ప్రక్రియ సాగుతుంది. మరోవైపు ఎన్‌ఐఏ దర్యాప్తు కూడా ఇంకా పూర్తి కాలేదు. తుది నివేదిక రావాలి. ఇవేవీ పట్టించుకోకుండా కేసు దర్యాప్తు ముగిసినట్టే అనే భ్రాంతి కలిగించేలా పచ్చ మీడియా హడావుడి చేస్తుండటమే అసలైన కుట్ర!!.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement