టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చిట్‌చాట్
దసరాకు చేద్దామనుకున్నా ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలతో సాధ్యం కాలేదు
త్వరలోనే మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీకి కొత్త కార్యవర్గం
వ్యాఖ్యల ఉపసంహరణతోనే కొండా సురేఖ వివాదం ముగిసిపోయింది
చాలామంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు
స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: దీపావళిలోపు రెండోదఫా కార్పొరేషన్ పదవులు ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. దసరాలోపు చేద్దామని అనుకున్నా హరియాణా, కశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదని, ఏఐసీసీ నాయకత్వం కూడా బిజీగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ, టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటులోనూ జాప్యం జరిగిందన్నారు. శుక్రవారం గాం«దీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
⇒ ఎంఐఎంతో స్నేహం వేరు. శాంతిభద్రతల సమస్య వేరు. నాంపల్లి నియోజకవర్గంలో మా పార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌పై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకుంటాం. విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దాడుల విషయంలో కఠినంగా ఉంటాం.
⇒ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది అవుతోంది. అందుకే చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ వేశాం. కానీ బీఆర్‌ఎస్‌కు చెందిన చాలామంది మాతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే మళ్లీ చేరికలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు కూడా వస్తారు.
⇒ సినీనటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కావాలని మాట్లాడలేదు. కేటీఆర్ వ్యవహారశైలి కారణంగానే అలా మాట్లాడారని అనుకుంటున్నా. అయినా అలా మాట్లాడాల్సింది కాదు. నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెబుతుందో చూడాలి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ విషయంలో అధిష్టానం మమ్మల్ని ఎలాంటి వివరణ అడగలేదు. అయినా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. ఆ రోజే ఆ విషయం క్లోజ్ అయ్యింది.
⇒ పేదలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. మూసీ, హైడ్రాలు భావితరాల కోసమే చేపట్టాం.
⇒ బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. మమ్మల్ని ఎదుర్కోవడమే ఆ రెండు పార్టీల టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశముంది. అయినా మాకేం నష్టం లేదు.
⇒ సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీఆర్‌ఎస్ మా మీద దు్రష్పచారం చేస్తోంది. దుబాయి నుంచి ఖాతాలు తెరిచి మరీ నడిపిస్తున్నారు. రూ. వందల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాను దురి్వనియోగం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
⇒ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పక్షాన మాట్లాడుతున్నారు. బీసీల పక్షాన మాట్లాడితే పార్టీ లైన్ తప్పారని అనలేం. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని మల్లన్నకు విజ్ఞప్తి చేస్తున్నా.
⇒ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ. రెండు పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ ఎంత దు్రష్పచారం చేసినా ప్రజలు నమ్మరు.
⇒ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు ఉన్నాయి. నెలరోజుల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళతా.
Comments
Please login to add a commentAdd a comment