మంత్రివర్గంలో చేరేందుకు సీపీఐ ఆసక్తి? | Sakshi
Sakshi News home page

మంత్రివర్గంలో చేరేందుకు సీపీఐ ఆసక్తి?

Published Wed, Dec 6 2023 1:11 AM

CPI leaders meeting with Revanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు మంగళవారం ఎల్లా హాటల్‌లో భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు రేవంత్‌ను కలిసి అభినందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తమను మంత్రివర్గంలోకి కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనిపై చాడ వెంకటరెడ్డిని ప్రశ్నించగా, తమకు అలాంటి ఆలోచన లేదనీ, అయితే కాంగ్రెస్‌ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని మాత్రమే చెప్పామన్నారు. అంటే సీపీఐకి ఈ ప్రభుత్వంలో నేరుగా భాగస్వామ్యం కావాలన్న ఆలోచన ఉన్నట్లుగా సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. 

ఒక్క సీటు గెలిస్తే మంత్రి పదవి వస్తుందా? 
అయితే, ఒక్క సీటు గెలిచిన సీపీఐకి కాంగ్రెస్‌  పార్టీ మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉండదనీ, కాంగ్రెస్‌లో ఉన్న వారికే సర్దుబాటు చేయడం కష్టమని 
అంటున్నారు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు వంటి వారు ఉన్నప్పుడు సీపీఐకి ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు.  

ప్రతిపాదిస్తే ఆలోచిస్తాం: నారాయణ 
మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టూరిజం అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై జ్యూడీషియల్‌ విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం బయటపడుతుందని భావించి విలువైన ద్రస్తాలను తగులబెట్టారని విమర్శించారు.

తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సంకుచిత వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రమాదకరమని, వ్యవస్థలను నాశనం చేస్తోందని విమర్శించిన ఆయన ఇండియా కూటమి బలపడాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతుకగా, అన్ని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధిగా ఉంటానన్నారు.  

Advertisement
 
Advertisement