మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు  | CPI Narayana open letter to Puvvada Nageswar Rao | Sakshi
Sakshi News home page

మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు 

Published Sun, Dec 3 2023 1:27 AM | Last Updated on Sun, Dec 3 2023 1:27 AM

CPI Narayana open letter to Puvvada Nageswar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఆయన తండ్రి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వర్‌రావు మద్దతు పలుకుతూ వివిధ రకాలుగా ప్రచారం చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వర్‌రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీకు ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీకి చేసిన సేవరీత్యా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు’అని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు.

‘మీ కుమారుడు అజయ్‌కుమార్‌ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీరు ఏ సభలకు వచ్చినా పార్టీ మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప, సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు.

తాజాగా కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్‌ సీపీఐకి కేటాయిస్తే అక్కడ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోటీకి పెట్టింది. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లోనూ మీరు సమర్ధించలేదు. మీ కుమారుడు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అజయ్‌కుమార్‌ను బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేశారు’అని నారాయణ విమర్శించారు. ‘మీరు నాటిన చెట్టుని నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుక్కుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’అని నారాయణ హితవు పలికారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement