puvvada nageswar rao
-
మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఆయన తండ్రి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వర్రావు మద్దతు పలుకుతూ వివిధ రకాలుగా ప్రచారం చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వర్రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీకు ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీకి చేసిన సేవరీత్యా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు’అని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మీ కుమారుడు అజయ్‌కుమార్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీరు ఏ సభలకు వచ్చినా పార్టీ మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప, సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు. తాజాగా కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తే అక్కడ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోటీకి పెట్టింది. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లోనూ మీరు సమర్ధించలేదు. మీ కుమారుడు, బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్‌ను బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేశారు’అని నారాయణ విమర్శించారు. ‘మీరు నాటిన చెట్టుని నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుక్కుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’అని నారాయణ హితవు పలికారు. -
టీఆర్ఎస్, ఎన్డీ, కాంగ్రెస్‌తో పొత్తులకు అవకాశం
భద్రాచలం, న్యూస్‌లైన్: వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ(ఎన్డీ)తో తమ పార్టీకి పొత్తులు ఉండే అవకాశముందని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... మతోన్మాదానికి వ్యతిరేకంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. బీజేపీతో పొత్తుకు ఉవ్విళ్లూరుతున్న టీడీపీతో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ భావిస్తోందన్నారు. సిట్టింగ్ స్థానాలైన కొత్తగూడెం, వైరాతోపాటు పినపాక, భద్రాచలం స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ మిత్రులుగా ఉన్న సోదర కామ్రేడ్లతో పోటీ రసవత్తరంగా ఉండబోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీతో పొత్తుకు సీపీఎం సిద్ధమవుతున్నట్టుగా తమకు సంకేతాలు ఉన్నాయన్నారు. పొత్తులపై పార్టీ రాష్ట్ర కమిటీ చర్చలు ప్రారంభించిందని, మరో పది రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు భద్రాచలం కేంద్రంగా పునరావాసం కల్పించాల్సిన అవసరముందని అన్నారు. ఇందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ముంపు భూనిర్వాసితులకు మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అదనంగా పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంత వాసుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో సీపీఐ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.