సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకోవాలని సీపీఐ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన కొత్తగూడెంతోపాటు చెన్నూరు లేదా మునుగోడు స్థానాలను ఇవ్వాలని కోరుతోంది. అందుకోసం ప్రయత్నాలు తీవ్రం చేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజాను స్థానిక నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర కమిటీకి బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర సమితి ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి సీపీఐ రాష్ట్ర విస్త్రృతస్థాయి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని తేల్చే బాధ్యతను కేంద్ర కమిటీకి అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులతో చర్చించి రెండు అసెంబ్లీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాల్సిందిగా కోరామని ఆయన చెప్పారు. కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలో గందరగోళం..
కాగా, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా బరిలో నిలవాలని సీపీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ మాత్రం అలా తెగతెంపులు చేసుకోవడానికి ఏమాత్రం సిద్ధపడడంలేదని తెలుస్తోంది. వామపక్షాలన్నీ కలసి పోటీ చేసినా ఎక్కడా గెలిచే పరిస్థితి లేదనీ, కాబట్టి ఎలాగైనా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటేనే అసెంబ్లీలో అడుగు పెట్టగలమని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోవడం, శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిందనీ, కేడర్ చెల్లాచెదురైపోతున్నారనేది సీపీఐ భావనగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలని సీపీఐ యోచిస్తోంది. అయితే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో మాత్రం నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు తెలిసింది. కొందరు సీపీఎం సహా ఇతర వామపక్ష, లౌకిక శక్తులతో కలసి పోటీ చేయాలని కోరగా, కొందరు ఎలాగైనా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని అన్నట్లు తెలిసింది. అంతేకాదు మునుగోడు, కొత్తగూడెం సీట్ల విషయంపై ఆయాచోట్ల తలెత్తిన అసంతృప్తి కూడా ఈ సమావేశంలో బయటపడినట్లు సమాచారం.
ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు ఖరారై కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చినా మునుగోడులో పోటీ చేసి తీరాల్సిందేనని కొందరు పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సమావేశానికి వచ్చిన సభ్యులను శాంతింప చేయడం కష్టమైందని సమాచారం. ఈ నేపథ్యంలో పొత్తు బాధ్యతను కేంద్ర కమిటీకి అప్పగించినట్లు తెలిసింది. ఒకవేళ కాంగ్రెస్‌తో సయోధ్య కుదరకుంటే, తదుపరి ఏం చేయాలన్న దానిపైనా కూడా కేంద్ర కమిటీనే తేల్చాలని కోరినట్లు వెల్లడైంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకుంటే దాదాపు 20 సీట్లలో పోటీ చేసే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment