సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు బెడిసికొట్టింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు తమకు కేటాయించేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విధించిన రెండు రోజుల గడువు ముగిసినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరి పోరుకే వెళ్లాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో 10 స్థానాల్లో పోటీకి సిద్ధపడాలన్న కీలక నిర్ణయానికి వచ్చింది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కలిపి 9 స్థానాల్లో పోటీ చేయాలని, ఇబ్రహీంపట్నంలోనూ బరిలో ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.
బుధవారం జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో మరో ఐదు స్థానాలను గుర్తించి మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు బెడిసికొట్టగా తెలంగాణలోనూ తమతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి.
ఐదు నుంచి రెండు సీట్లకు తగ్గినా...
మునుగోడు ఉపఎన్నికలో తమతో పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్... ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధపడటంతో కాంగ్రెస్‌తో జత కట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నాయి. అందుకు కాంగ్రెస్ కూడా సముఖత వ్యక్తం చేసింది. మొదట్లో సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్‌ను కోరగా ఆ తర్వాత జరిగిన చర్చల్లో మూడు చొప్పున సీట్లు ఇవ్వాలని అడిగాయి. చివరకు ఆ సంఖ్య రెండేసి స్థానాల వద్దకు చేరుకుంది.
సీపీఐ కొత్తగూడెం, మునుగోడు అడగ్గా సీపీఎం మిర్యాలగూడతోపాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను కోరింది. కానీ కాంగ్రెస్ మాత్రం వారు కోరిన స్థానాల్లో మార్పులు చేసింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని ప్రతిపాదించినట్లు లెఫ్ట్ వర్గాలు తెలిపాయి. చివరకు సీపీఎంకు వైరా స్థానం కేటాయించే విషయంలో కాంగ్రెస్ పేచీ పెట్టింది. ఆ స్థానం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే పొత్తు ఉంటుందని సీపీఎం తేల్చిచెప్పింది.
సీపీఐ దారెటు?
సీపీఐతో పొత్తు విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఆ పార్టీకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినా ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయకపోవడంపై సీపీఐ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒంటరి పోరుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయించగా సీపీఐ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాంగ్రెస్‌తో ఎలాగైనా కలిసి ముందుకు సాగాల్సిందేనని, అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని సీపీఐకి చెందిన ఒక కీలక నేత పట్టుబడుతున్నట్లు సమాచారం.
‘లెఫ్ట్’ఉమ్మడి పోరు యోచన...
ఒకవేళ సీపీఐతోనూ కాంగ్రెస్ పొత్తు కుదరకుంటే లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మేరకు లెఫ్ట్ పార్టీల ఉమ్మడి సమావేశం నేడు లేదా రేపు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సీపీఐ రా్ర‹Ù్టర సమితి సైతం బుధవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు ఉమ్మడి పోరుకు దిగితే దాదాపు 30 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్–సీపీఎం పొత్తు చిత్తు!
Published Wed, Nov 1 2023 4:21 AM | Last Updated on Wed, Nov 1 2023 4:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment