సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌బై చెప్పింది. అడిగిన సీట్లు ఇవ్వలేదంటూ ఒంటరి పోరుకు సిద్ధమైంది. 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా పొత్తులు, అభ్యర్థులపై కాంగ్రెస్‌కు సీపీఎం ఇచ్చిన డెడ్‌లైన్ దాటిపోవడంతో పోటీ చేసే స్థానాల జాబితాను ప్రకటించింది. 17 మందితో కూడిన సీపీఎం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం గురువారం ప్రకటించారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, హైదరాబాద్ జిల్లాలో సీపీఎం పోటీ ఉంటుందని తమ్మినేని వెల్లడించారు. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హూజుర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌తో కూడిన జాబితాను విడుదల చేశారు.
భద్రాచలంలో 8సార్లు వరుసగా గెలిచామని తమ్మినేని తెలిపారు. పాలేరు, భద్రాచలం సీటు కావాలని తాము పట్టుపడితే కాంగ్రెస్ ఇవ్వలేదని మండిపడ్డారు. భద్రాచలం, సత్తుపల్లి, పాలేరు సిట్టింగ్ కాబట్టి ఇవ్వబోమన్నారని తెలిపారు. వైరా, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో ఇస్తామని చెప్పారన్నారు. తాము అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే సీట్లకు చెప్పినా కూడా పొత్తు విషయంలో కాంగ్రెస్ మాట మార్చిందని దుయ్యబట్టారు. తమకు ఇస్తామన్న సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. చర్చల సమయంలో ఎన్నో మెట్లు దిగి మాట్లాడామని, ఇంత అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్‌తో కలిసి ఉండాలా విడిపోవాలా అన్నది సీపీఐ ఇష్టమని తమ్మినేని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ సీపీఐకి రెండు టికెట్లు ఇస్తే.. అక్కడ పోటీ పెట్టబోమని తెలిపారు. సీపీఐ నిలబడే స్థానాల్లో వారకే సీపీఎం మద్దతిస్తుందన్నారు. మిత్రుత్వంతో చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలన్న ఆయన.. పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణమని విమర్శించారు.
చదవండి: చెన్నూరు నుంచి వివేక్..ఎంపీగా కొడుకు పోటీ!
కమ్యూనిస్టుల ప్రాధాన్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిగా ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. నిన్న భట్టి ఫోన్ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం వరకు ఎదురుచూశామని, అనివార్య పరిస్థితుల్లో విడిగా వెళ్లడానికే నిర్ణయంచుకున్నామని తెలిపారు. బీజేపీని ఓడించడానికి బీఆర్‌ఎస్‌ను కూడా సపోర్టు చేస్తామన్నారు. అసెంబ్లీలో పేదల గొంతు వినిపించాలంటే సీపీఎంను గెలిపించాలని, కమ్యూనిష్టులు లేని శాసన సభలు దేవుడి లేని దేవాలయాలుగా ఉంటాయన్నారు.
‘పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ అనుకుంటుంది. పొత్తుల బ్రేకప్ మేము కోరుకుంది కాదు. ఏమెల్సీలు, మంత్రి పదవులు తీసుకోవడం సీపీఎం పార్టీ విధానం కాదు. సీపీఎం ఆనాడే ప్రధాని పదవిని సూత్రప్రాయంగా వదిలివేశాము. దాదాపు 24 సీట్లకు ప్రతిపాదనలు వచ్చాయి. కార్యవర్గంలో చర్చించి మరో రెండు మూడు సీట్లు ప్రకటిస్తాం. ఈ ప్రకటించిన సీట్లలో మార్పులు జరిగే అవకశాలున్నాయి.
కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదరకపోతే మార్పులు ఉంటాయి. అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం. బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ ఓడిపోయే సీట్లలో ఎవరు ఓడించే వారైతే వాళ్లకు ఓటు వేస్తాం. అది కాంగ్రెస్ అయినా బీఆర్‌ఎస్ అయినా’ అని తమ్మినేని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment