Telangana: పాతిక సీట్లతో సర్దుకోండి! | Cut in Assembly seats that Telangana Congress allocate to BC leaders | Sakshi
Sakshi News home page

Telangana: పాతిక సీట్లతో సర్దుకోండి!

Published Sun, Oct 1 2023 3:48 AM | Last Updated on Sun, Oct 1 2023 7:58 AM

Cut in Assembly seats that Telangana Congress allocate to BC leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బలహీన వర్గాల నేతలకు టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ గళం మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు ఇస్తామని ఆ పార్టీ పెద్దలు చెప్పినా ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గెలుపు అవకా­శాలు ఉన్నాయని సర్వేల్లో తేలిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వగలమని.. మిగతా వారికి ఇవ్వలేమని హైకమాండ్‌ స్పష్టం చేసిందని అంటున్నాయి.

రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన బీసీ నేతలు అధిష్టానం పెద్దలను కలసినప్పుడు ఈ సంకేతాలు ఇచ్చిందని పేర్కొంటున్నాయి. ఈ సారికి 25 అసెంబ్లీ స్థానాలతో సర్దుకోవాలని.. అధికారంలోకి వచ్చా­క బీసీ నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే అధికారికంగా ప్రకటిస్తామని పెద్దలు చెప్తున్నారనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇతర పదవులు ఇస్తామంటూ... 
ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌తోపాటు తెలంగాణలోని సామాజిక ముఖచిత్రం నేపథ్యంలో ఈసారి తమకు 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ బీసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు పోటీచేసే అర్హత ఉన్న 50మందికిపైగా నేతల పేర్లతో అధిష్టానానికి జాబితా కూడా అందజేశారు. కనీసం పీసీసీ అధ్యక్షుడు చెప్పిన విధంగా, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు 34 అసెంబ్లీ స్థానాలైనా ఇవ్వాలని వారు కోరుతున్నారు.

కానీ 25కి మించి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. రేవంత్‌ మాట ప్రకారం 34 సీట్లు ఇచ్చే పరిస్థితి లేకుంటే.. ఎన్ని తక్కువ ఇస్తే అన్ని నామినేటెడ్‌ పదవులు (ఎమ్మెల్సీ) ఇస్తామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 9 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామని టికెట్ల కేటాయింపు సమయంలోనే పార్టీ పక్షాన అధికారికంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. దీంతోపాటు బీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు బీసీలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ కూడా నలుగురు బీసీ నేతలకు రాజ్యసభ అవకాశం కల్పిస్తుందన్న హామీపై చర్చ జరుగుతోంది. 

ప్రతి లోక్‌సభ సీటు పరిధిలో రెండు సాధ్యం కాదంటూ..!
రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో రెండు చొప్పున మొత్తం 34 అసెంబ్లీ టికెట్లను బీసీలకు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గతంలో మాటిచ్చారు. కానీ తాజా పరిణా మాలతో ఈ హామీ అమలు సాధ్యమవడం లేద నే చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు నేతృత్వంలో నిర్వహించిన సర్వేల్లో బీసీ సీనియర్‌ నేతలకు కూడా సాను కూలత రాలేదని.. ఈ క్రమంలో కచ్చితంగా గెలుపు వరకు రాగల బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని అధిష్టానం పేర్కొన్నట్టు తెలిసింది.

బీసీ నేతలు ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి నప్పుడు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశార ని సమాచారం. పార్టీ అధికారంలోకి రావాలంటే సర్దుకుపోవాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌ 22 చోట్ల బీసీలకు అవకాశం ఇచ్చిందని.. ఆ పార్టీ కంటే ఒకట్రెండు స్థానాలు ఎక్కువే ఇస్తామని, ఇదే విషయాన్ని బీసీ వర్గాలకు వెల్లడించాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. సర్వేల ప్రాతిపదికన ఇది తప్పడం లేదని, సర్వేల విషయంలో ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే తనకు తెలపాలని బీసీ నేతలకు కేసీ వేణు గోపాల్‌ సూచించినట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement