
కోటనందూరు: అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో మాజీ సీఎం చంద్రబాబు వంకర రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిళ్లనందూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేయడానికే రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులతో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుల ముసుగులో పాదయాత్ర చేయించే బదులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ యాత్ర చేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు పాదయాత్ర చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది కాబ ట్టి దొడ్డిదారిలో ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. చంద్రబాబు పాదయాత్రగా విశాఖ వచ్చి అక్కడ పరిపాలన రాజధాని వద్దని చెప్పగలరా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద స్కామ్ అని మంత్రి ఆరోపించారు.
చంద్రబాబుకు ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు కాబట్టే రైతులను రెచ్చగొట్టి పాదయాత్ర చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు చేయించే యాత్ర అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాదని, అది కేవలం ఒక కులం అభివృద్ధి కోసం చేసే పాదయాత్ర మాత్రమేనని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment