అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర పేరుతో ఇంతకాలం సాగిన డ్రామాలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఆ నాటకం బహిర్గతం కావడంతో పాదయాత్రకు బ్రేక్ వేసుకోక తప్పలేదు. అది తాత్కాలికం అవుతుందా? లేక శాశ్వతం అవుతుందా అన్నది చెప్పలేకపోయినా, ఏ మాత్రం ఆలోచనపరులైనా ఈ ప్రహసనానికి పుల్ స్టాప్ పెట్టాలి. ఈ పాదయాత్ర అంతా తెలుగుదేశం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని, దానికి జనసేన మరికొన్ని పార్టీలు సహకరిస్తున్నాయని వెల్లడైంది. అసలు రైతులు ఎందరు? నకిలీ రైతులు ఎందరు అన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తుంది.
చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట..
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సరిగా అమలు చేయకపోతే ఏకిపారేసే ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే మాత్రం ఆంక్షలు పెడతారా అంటూ గగ్గోలు పెట్టాయి. నిజానికి ఇలాంటి అంశాలపై పాదయాత్రలకు గౌరవ న్యాయ స్థానం అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ ఏ ఆలయానికి అయినా వెళ్లాలని అనుకుంటే ఏ బస్‌లోనే వెళ్లి రండని చెబితే సబబుగా ఉండేది. అలాకాకుండా ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో ఏపీ సమాజంలో ఒక రకమైన అశాంతి ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడింది.
అనవసరమైన శాంతిభద్రతల సమస్యకు అవకాశం ఇచ్చినట్లయిందనిపిస్తుంది. అయిన ఏపీ ప్రభుత్వం కాని, పోలీసులు కాని తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడంతో అలాంటి వివాదాలు ఏవీ పెద్దగా రాలేదు. ఇదే సమయంలో గౌరవ హైకోర్టు అమరావతి పాద యాత్రికులకు కొన్ని షరతులు విధించింది. అవి లేకుంటే మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది. 600 మించి రైతులకు అనుమతి ఇవ్వవద్దని, వారికి గుర్తింపు కార్డులు ఉండాలని, రాజకీయ నేతలకు అవకాశం ఇవ్వవద్దని, నాలుగు వాహనాలు మించి ఉండరాదని, ప్రభుత్వాన్ని విమర్శించరాదని, సంఘీభావం చెప్పాలనుకున్నవారు రోడ్డు పక్కనే నిలబడాలని.. ఇలా కండిషన్లు పెట్టింది. కాని వీటిలో ఏ ఒక్కటి కూడా ఈ పాదయాత్ర చేసేవారు పాటించలేదు.
అయినా పోలీసులు ఈ నలభై రోజులూ చూసిచూడనట్లు వ్యవహరించారు. దానిని అలుసుగా తీసుకున్న పాద యాత్రికులు ఆయా చోట్ల రెచ్చి పోయి వ్యవహరించారు. ఇదే సమయంలో పాదయాత్రకు నిరసనలు చెప్పడం ఆరంభం అయింది. వీరు అమరావతిలోనే సమస్తం పెట్టాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేస్తుంటే, దీనిని వ్యతిరేకిస్తూ ఆయా చోట్ల నిరసన ర్యాలీలు, ప్లెక్సీల ఏర్పాటు , వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా గర్జనలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు వంటివి జరిగాయి. కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా నిరసనలలో పాల్గొన్నారు. ఆ క్రమంలో ఇరుపక్షాల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడిన మాట నిజమే.
తణుకు, రాజమండ్రి వంటి చోట్ల పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. కాగా కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం వద్దకు యాత్ర వెళ్లేసరికి మొత్తం లోగుట్టు బయటకు వచ్చింది. అమరావతి జేఏసీ వారు కోర్టుకు వెళ్లి పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేయగా, హైకోర్టు వారు అన్నిటిని పరిశీలించి, తాము పెట్టిన షరతులు కచ్చితంగా పాటించాలని, పోలీసులు ఆ మేరకు చర్య తీసుకోవాలని స్పష్టం చేయడంతో ఈ జేఏసీ, పాద యాత్రికుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇన్ని రోజులు తమకు తోచిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు, లేదా వారు కిరాయికి తెచ్చుకున్నవారు ఈ యాత్రలో పాల్గొంటూ, అక్కడక్కడ తొడలు చరుచుకుంటూ, చెప్పులు చూపుతూ వైసీపీ వారిని రెచ్చగొడుతూ సాగించారు.
హైకోర్టు తాజా ఉత్తర్వులతో రామచంద్రపురం వద్ద పోలీసులు పకడ్బందిగా వ్యవహరించారు. వారిని ఒకరకంగా అభినందించాలి. రైతుల గుర్తింపు కార్డులను చూపాల్సిందేనని పట్టుబట్టారు. ఎలాగొలా అలజడి సృష్టించి దీనిని డైవర్ట్ చేయాలని పాదయాత్రికులు కొందరు ప్రయత్నించారు. కాని పోలీసులు ససేమిరా అనడంతో గుర్తింపు కార్డులు లేనివారు జారుకున్నారు. దాంతో ఈ పాదయాత్రలో అసలు రైతులు కన్నా నకిలీ రైతులే ఎక్కువగా ఉన్నారన్న అంశం ప్రజలకు తెలిసిపోయింది. 600 మంది రైతులకు అవకాశం ఉంటే, కేవలం 75 మంది మాత్రమే గుర్తింపుకార్డు కలిగి ఉన్నారట. కొందరు వేరేవారి కార్డులు తెచ్చారట. అమరావతిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 24 వేల మంది రాజధాని కోసం భూములు ఇచ్చారు. కాని వారిలో ఒక్క శాతం కూడా ఈ పాదయాత్రలో పాల్గొనలేదు.
కేవలం ఈనాడు, తదితర టీడీపీ మీడియాలలో మాత్రమే వందల మంది నడుస్తున్నట్లు, వారికి వేల మంది స్వాగతం పలుకుతున్నట్లు దొంగ ప్రచారం చేశారని తేటతెల్లమైంది. ఎక్కడికక్కడ టీడీపీ, జనసేనకు చెందినవారు వీరితో కలిసిపోయి హడావుడి చేసే యత్నం చేశారు. పోలీసులు హైకోర్టు నిర్ణయాలను పాటిస్తే దానిని తప్పు పడుతూ ఈనాడు మీడియా ఆంక్షల అడ్డంకులు అని హెడింగ్ పెట్టింది. అంతే తప్ప హైకోర్టు ఉత్తర్వులు అమలు చేశారని చెప్పలేదు. పైగా ఈ పాదయాత్ర చేసేవారిని పోలీసులు హింసించారని, నేలకేసి కొట్టారని, ఇలా తప్పుడు ప్రచారం చేయడానికి టీడీపీ మీడియా నానా తంటాలు పడింది.
రైతులు నిర్ణీత సంఖ్యలో పాల్గొనడం లేదని వెల్లడికాగానే తెలుగుదేశం వారు కొత్త అబద్దం సృష్టించారు. రైతుల గుర్తింపు కార్డులను పోలీసులు చించివేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు ఆరోపించారు. దానిని వారి మీడియా ప్రముఖంగా ఇచ్చింది. నిజంగానే అలా జరిగి ఉంటే ఈపాటికి ఎంత రచ్చే చేసేవారు. ఎందుకంటే నిరంతరం ఈ మీడియా తన కెమెరాలను పాద యాత్రికుల వెంట తిప్పుతోంది. అలాంటప్పుడు వీరి కన్నుకప్పి పోలీసులు గుర్తింపు కార్డులను చించుతారా? కేవలం ఆ కార్డుల కోసం పోలీసులు పట్టుబడితే, అవి లేనివారు వెనకగుండానో, మరో మార్గంలోనో జారుకున్నారు.
నిజంగానే ఈ రైతులకు చిత్తశుద్ది ఉంటే గుర్తింపు కార్డులు ఉన్న డెబ్బై ఐదు మంది అయినా పాదయాత్ర కొనసాగించి ఉండవచ్చు కదా?. మరి అలా ఎందుకు చేయలేదు. అతి తక్కువ మంది రైతులే ఈ యాత్రలో ఉన్నారన్న సంగతి మరింతగా ప్రచారం జరిగే అవకాశం ఉండడం, దీనివల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మరింతగా నష్టపోతుందన్న ఆందోళన, ఉత్తరాంధ్రకు వెళ్లే కొద్దీ వీరికి నిరసన సెగ పెరుగుతుందన్న ఆందోళన, రోజూ లక్షల రూపాయల వ్యయం, వీటిని భరించే టీడీపీ స్థానిక నేతలు కొందరు చేతులు ఎత్తివేయడం వంటి కారణాల వల్లే చివరికి పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించి వారి వాహనాలలో తిరుగు ముఖం పట్టారు.
కాకపోతే భేషజానికి మాత్రం తాము తాత్కాలికంగానే వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. బహుశా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ వీరిని ఉసికొల్పి యాత్ర కొనసాగించేలా చూస్తే తప్ప, ఇది ఆగిపోవచ్చు. ఇంతకాలం ఈ రైతులు ఐదుగురో పది మందో వంద మందో అమరావతి గ్రామాలలో శిబిరంలో కూర్చుని తమకు మద్దతు ఇచ్చే టివీల ముందు ప్రభుత్వాన్ని విమర్శించి తమ ఇళ్లకు వెళ్లిపోతుండేవారు. కాని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతి పాదయాత్ర ప్లాన్ చేశారు. దాని విషయంలో ప్రభుత్వం ఒక రకంగా సహకరించిందని చెప్పాలి. ఆ యాత్ర సజావుగా తిరుపతి చేరుకుంది.
దాంతో చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలోని అరసవల్లికి పాదయాత్రకు పురికొల్పారు. పోనీ అది అయినా నేరుగా వెళ్లారా అంటే అలాకాకుండా, టీడీపీకి కాస్త పట్టు ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాల గుండా , అడ్డదిడ్డమైన రూట్లలో యాత్ర సాగించారు. ఇదంతా చూసేవారికి నీ ముక్కు ఏది అంటే మొహం చుట్టూ తిప్పి చూపినట్లుగానే వీరు ప్రవర్తిస్తున్నట్లు అర్ధం అయింది. గుడివాడ వంటి చోట్ల టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు తొడలు కొట్టడం, మాజీ ఎంపీ మాగంటి బాబు చెప్పు చూపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.
ఆ రకంగా సాగుతూ వచ్చిన ఈ యాత్రకు ఇప్పుడు బ్రేక్ పడింది. అసలు మూడు రాజధానుల చట్టాన్నే ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి జేఏసీ పేరుతో ఈ పాదయాత్ర నిర్వహించడం, అందులో అసలు రైతులు కన్నా, నకిలీ రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా ఉండడంతో మొత్తం యాత్ర అప్రతిష్టపాలైంది. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా వీరు పాదయాత్ర చేయడం వైసీపీకి కలిసివచ్చినట్లయింది. ఆ పార్టీ యాక్టివ్ అయి, ప్రజలలో దీనిపై చైతన్యం తెచ్చింది. దాంతో టీడీపీ అనుకున్నది ఒకటి అయిందొకటి అని చెప్పాలి. ఏతావాతా పాదయాత్ర ప్లాన్ ఎందుకు వేశామా అని టీడీపీ నేతలే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడడం కొసమెరుపు గా భావించవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment