మత్స్యకారుల ఆత్మీయసభలో మాట్లాడుతున్న మంత్రి దాడిశెట్టి రాజా
తొండంగి: దీర్ఘకాలంగా ఓట్లేసి గెలిపించి రాష్ట్రస్థాయి పదవులను అనుభవించేందుకు అవకాశం ఇచ్చిన కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబుకు అక్కడే దిక్కులేదని, రాబోయే రోజుల్లో టీడీపీకి అడ్రస్ కూడా ఉండదని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచా యతీలోని కొత్తచోడిపల్లిపేటలో గురువారం జరిగిన మత్స్యకారుల ఆత్మీయసదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కుప్పం ప్రజల్ని వాడు కుని వదిలేశారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తూనే కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడంతో అక్కడ ఇప్పుడు చంద్రబాబుకే దిక్కులేదని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా మత్స్యకారులకు మత్స్యకార భరోసా ద్వారా రూ.పదివేలు, స్మార్ట్‌కార్డుల ద్వారా డీజిల్ లీటరుకు రూ.9 తక్షణ రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. కోన ప్రాంత మత్స్యకారులకు ఎటువంటి కష్టం రాకుండా తాను అండగా ఉంటానన్నారు. మినీ పోర్టు, బల్క్‌డ్రగ్ పార్క్‌లతో కోన ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి కారణంగా హేచరీలకు, మత్స్యకారుల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగనీయబోమని సీఎం ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సుమారు 300 మంది మత్స్యకారులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పారు. ఈ సదస్సులో జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలతాహరి, తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్యా మురళి, మత్స్యకార విభాగం తుని నియోజకవర్గ కన్వీనర్ మేరుగు ఆనందహరి, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, యు.కొత్తపల్లి మండలం ఎంపీపీ కారే శ్రీనివాసరావు, ఏలేరు రిజర్వాయర్ చైర్మన్ తోలాడ శైలాపార్వతి, పార్టీ నాయకులు గాబు రాజు, గంగిరి అడివియ్య, బద్ది నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment