జగన్‌ మానియాను చూసి పవన్‌కు మతిపోయింది  | Dadisetti Raja Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

జగన్‌ మానియాను చూసి పవన్‌కు మతిపోయింది 

Published Sun, Apr 24 2022 4:02 AM | Last Updated on Sun, Apr 24 2022 4:02 AM

Dadisetti Raja Comments On Pawan Kalyan - Sakshi

తుని: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జనరంజక పాలనతో ప్రజల్లో అపరిమిత అభిమానాన్ని పొందారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో జనసేన కార్యకర్తలే జై జగన్‌ అంటూ ఇచ్చిన నినాదాలు ఇందుకు నిదర్శనమన్నారు. జగన్‌ మానియాను చూసి పవన్‌కు మతిపోయిందన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉంటే పవన్‌ మాత్రం వారంతా కష్టపడుతున్నట్టుగా మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేవని, పవన్‌కి, చంద్రబాబుకి మాత్రమే ఉన్నాయని అన్నారు. కష్టాల్లో ఉన్న చంద్రబాబు కన్నీళ్లు తుడవటానికి పవన్‌ బయటకు వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో  అరాచకాలు, కష్టాలు పడ్డ రైతుల కన్నీళ్లు పవన్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దే«శంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని, రైతు భరోసా ద్వారా నేరుగా అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నారని, పవన్‌ ఈ విషయాన్ని గమనించలేదా అని అన్నారు. పవన్, చంద్రబాబుల్లో ఒకరిది అమ్మే సిద్ధాంతం, ఇంకొకరిది కొనే సిద్ధాంతమని చెప్పారు.

ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క
పార్టీ పెట్టి తనను నమ్ముకున్న వాళ్లను అమ్మడమే సిద్ధాంతంగా పెట్టుకున్న పవన్‌ మంచి రేటు కోసం తాపత్రయ పడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు.  చంద్రబాబును ప్రశ్నిస్తే  అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వమంటారోనని నోరు మెదపని పవన్‌కు సీఎం జగన్‌ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. 2024లో మరోసారి పవన్‌ పార్టీని అద్దెకివ్వడానికి చంద్రబాబుతో మాట్లాడుకున్నారని చెప్పారు. ప్యాకేజీ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అయితే పీపుల్స్‌ స్టార్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. ఎంతమంది మల్లులు ఎన్ని విల్లులు విసిరినా ఇక్కడ ఉంది పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదని, ఎన్నో పద్మ వ్యూహాలను ఛేదించిన జగన్మోహనుడని తెలిపారు. జగన్‌ పాలన చూసిన ప్రజలు సీఎంగా జగనే కరెక్ట్‌ అని ఫిక్స్‌ అయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అనే విషయాన్ని మల్లులు, ఈ విల్లులు గుర్తుంచుకోవాలని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement