జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అది ఆయన నాటకీయంగా వెల్లడించినా, అందులో ఆయన బలహీనతలను చెప్పకనే చెప్పేశారు. ఆయన ప్రకటన తర్వాత పిఠాపురంలో తెలుగుదేశం నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే కొంత రిస్కు ఉన్నట్లే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ పోటీచేసేది చివరి వరకు సస్పెన్స్ లో ఉంచాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఎప్పుడైతే వారాహి యాత్ర పిఠాపురం ప్రాంతం నుంచి ప్రారంభించారో, పిఠాపురం వెళ్లి అక్కడ వల్లభుడి గురించి ప్రస్తావించారో,అంతా అక్కడ నుంచే పోటీచేస్తారని భావించారు. కాకపోతే ఆయన అప్పట్లో ఆ విషయం చెప్పలేదు.
గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఆ రెండింటిలో కాకుండా పిఠాపురం ఎంపిక చేసుకోవడం ద్వారా ఆయన ఆ రెండు చోట్లనుంచి పారిపోయారన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. దానికి ఆయన ఇచ్చిన బిల్డప్ తమాషాగా ఉంది. భీమవరం సీటును మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు కు ఇచ్చానని , గాజువాక టీడీపీ వాళ్లు తీసేసుకున్నారని అన్నారు. ఆ మద్య భీమవరం వెళ్లి మళ్లీ పోటీచేయాలన్న ఆలోచనపై అక్కడి ప్రముఖులతో చర్చలు కూడా జరిపారట.అయినా ఆయనకు నమ్మకం కుదరలేదు. దాంతో భీమవరంలో మళ్లీ పోటీకి భయపడ్డారని అంటారు. ఇక గాజువాక నుంచి తిరిగి పోటీచేసి ప్రతిష్టను నిలబెట్టుకుంటారని ఆయన అభిమానులు అనుకున్నారు.
కాని ఆ వైపే వెళ్లడానికి ఈయన సందేహించారు. పైగా టీడీపీ వారు ఈయనకు చెప్పకుండానో, తెలియకుండానో లాగేసుకున్నట్లు మాట్లాడడం ద్వారా తన బలహీన పరిస్థితిని ఒప్పుకున్నారు.ఒక దశలో తిరుపతి వైపు కూడా చూడకపోలేదు. కాని దానిని కూడా వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. సొంత పార్టీ నేతలు ఎవరికి ప్రాధాన్యం ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలకే పవన్ అవకాశం ఇవ్వడం లో కూడా చంద్రబాబు పాత్ర ఉందని, ఆయన ఏమి చెబితే దానిని జీ హుజూర్ అంటూ ఒప్పుకుంటున్నారన్న భావన జన సైనికులలో ఏర్పడింది. ఎంపీ సీటుకు పోటీచేయాలో, వద్దో అన్నది పెద్దలతో మాట్లాడి నిర్ణయిస్తానని అన్నారు.అంటే దాని అర్ధం బహుశా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీచేస్తారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పిఠాపురంలో తొంభై వేల మంది కాపులు ఉన్నారని, వారిలో మెజార్టీ తనకు మద్దతు ఇస్తారన్న ఆశతో పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు.లేకుంటే ఆయన కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునేవారేమో!ఎందుకంటే కాకినాడ వెళ్లి అక్కడి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో దమ్ముంటే పవన్ వచ్చి కాకినాడ సిటీలో పోటీచేయాలని, తనను ఓడించాలని సవాల్ చేశారు. ఆ చాలెంజ్ ను పవన్ స్వీకరిస్తారని ఆయన అభిమానులు ఆశించారు.కాని పవన్ భయపడి అటు వైపు వెళ్లలేదు. చంద్రశేఖరరెడ్డి గురువారం నాడు మరోసారి అదే సవాల్ విసిరారు. అయినా పవన్ వైపు నుంచి స్పందన కొరవడింది. పిఠాపురంలో మామూలుగా అయితే పవన్ గెలవచ్చని జనసైనికులు భావించారు. కాని అక్కడ పరిస్తితులు మారడం, తెలుగుదేశం నేత వర్మ వర్గీయులు పవన్ కళ్యాణ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆయనను, చంద్రబాబును తీవ్రంగా దూషిస్తూ ఫ్లెక్సీలను దహనం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశం కూడా అయ్యారు. చివరికి తగ్గుతారో,లేదో కాని,పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుకూల వాతావరణాన్ని అయితే చెడగొట్టినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం ఆ పరిణామాలపై స్పందించకుండా మౌనంగా ఉండడం కూడా అనుమానాలకు తావిచ్చింది.
ఇక.. వైఎస్సార్‌సీపీ అభ్యర్దిగా ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత గతంలో అక్కడ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. జడ్పి చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఎంపీగా జనంలోనే ఉంటారు. ఆమెపై ప్రజలలో అసంతృప్తి లేదు. ఆమె పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ అవుతారని అనుకుంటే ఆమెనే కొనసాగించవచ్చు. మరో నేత ఎవరైనా అంతకన్నా తీవ్రమైన పోటీ ఇచ్చి పవన్ ను ఓడిస్తారని సర్వేలలో తేలితే అభ్యర్ధిని మార్చుతారేమో తెలియదు. వైఎస్సార్‌సీపీ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని సీరియస్ గానే తీసుకుని పవన్ ఓటమికి కృషి చేస్తోంది.
పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చంద్రబాబు, లోకేష్ ల నుంచి ఒక్క ప్రకటన వచ్చినా పవన్ కు పోటీ తేలిక అయి ఉండేది. పవన్ సీఎం పదవికి తగడన్న చందంగా లోకేష్ మాట్లాడినా ఈయన నోరు విప్పలేదు. అదంతా అవమానంగా మారింది. 24 సీట్లు తీసుకోవడంతో జనసేన సత్తా ఇదేనా అన్న చర్చ ఆరంభం అయింది. దానిని 21 సీట్లకు తగ్గించుకోవడంతో మరింత అప్రతిష్టపాలయ్యారు. పైగా ఇచ్చిన 21 సీట్లలో కూడా కొన్నిటిని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కేటాయించడంతో ఈయన పార్టీ నడపడంలో అసర్ధులన్న అభిప్రాయం ఏర్పడింది. సహజంగానే దీని ప్రభావం ఎన్నికపై పడుతుంది. ఇదే టైమ్ లో పవన్ పై గెలిచే వైసిపి నేతకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ కూడా రావచ్చు. అది జరిగితే పోటీ మరింత పెరుగుతుంది. ఎందుకంటే పవన్ గెలిచినా ,ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయనకు వచ్చేది మంత్రి పదవే. వైఎస్సార్‌సీపీ గెలిచినా అదే మంత్రి పదవి వైఎస్సార్‌సీపీ అభ్యర్దికి కూడా వస్తుందన్న బావన ఏర్పడితే వైఎస్సార్‌సీపీ గెలిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన వివిద కార్యక్రమాల వల్ల కాపులతో సహా పేదవర్గాలన్నీ లబ్ది పొందాయి. కాపు నేస్తం కింద పిఠాపురంలోని వేలాదిమంది కాపు మహిళలకు ఆర్దిక సాయం అందింది.వారిలోమెజార్టీ వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తే అది పవన్ కు గట్టి దెబ్బ అవుతుంది. పవన్ కళ్యాణ్ నోటి దురుసుతో వలంటీర్లను కించపరుస్తూ పలుమార్లు మాట్లాడారు. వారి ప్రభావం ఏదో రకంగా ప్రజలలో ఉంటుంది.వారు కూడా పవన్ కు వ్యతిరేకంగా తమ సత్తా చూపితే అది పవన్ కు పెద్ద తలనొప్పి అయ్యే అవకాశం ఉంటుంది.మిత్రపక్షమైన టిడిపి ఎంతవరకు సహకరిస్తుందనేది సందేహమే. అసలు చంద్రబాబే ఈయనను ఓడించడానికి పూనుకుంటారేమోనన్న డౌట్లు కూడా లేకపోలేదు. పవన్ కనుక ఇక్కడ ఓడిపోతే, తనకు రాజకీయంగా చికాకు ఉండదని ఆయన అనుకోవచ్చు.
అదెలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కనుక రాజీపడకుండా, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తే పవన్ పరిస్థితి క్లిష్టంగా మారవచ్చు.సాధారణంగా ఒక ప్రముఖుడు ఎవరైనా తమ నియోజకవర్గంలో పోటీచేస్తున్నారంటేనే, సంబందిత పార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి. అలాకాకుండా ఏకంగా పవన్ కు నిరసన తెలపడం తీవ్రమైన విషయమే. అంటే అంత సానుకూలత లేదన్న విషయం అర్దం అవుతుంది.పవన్ స్థానికుడు కాడని, ప్రజలకు అందుబాటులో ఉండడని, ఇప్పటికే స్థానిక నేతలు ప్రజలకు తెలియచేసే పనిలో ఉన్నారు.గోడలపై అలాంటి ప్రచారం కూడా చేసేశారు.నిజంగానే పార్టీ అధినేతగా ఉండే, నెలకు ఒకసారో,రెండుసార్లో వచ్చి వెళ్లే పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికైతే అసలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ అబిప్రాయం ప్రబలితే కూడా నష్టం జరగవచ్చు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన కుమారుడు గిరితో సహా వైఎస్సార్‌సీపీలో చేరడం, ఆయనకు ఈ ప్రాంతం అంతా కొంత పట్టు ఉండడం కూడా పవన్ కు గండంగా మారవచ్చు.
పవన్ కు ఉన్న ఒకేఒక్క సానుకూల అంశం కేవలం ఆయన సినీ నటుడు కావడమే. ఆ రకంగా కొంతమంది అభిమానులు ఉండడమే. కాని ఆయన ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబుకు పూర్థి స్థాయిలో లొంగిపోయారో, అప్పటి నుంచి కాపువర్గంలో కూడా ఆయనపై అయిష్టత మొదలైంది. ఈయనేదో ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తే, తనకు అర్హత లేదని చెప్పి పరువు తీసుకున్నారని, జనసేనకు అసలు నెట్ వర్క్ లేదని ఆయనే చెప్పేశారని,ఇంకేమి పార్టీ నడుపుతారన్న ప్రశ్న కాపులలో వచ్చింది.
కాపు ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యతిరేక వైఖరిని కాపులు గుర్తుచేసుకుంటే ఆయనకు ఆ వర్గంలోకూడా ఆదరణ ఉండకపోవచ్చు. జనసేనకు బూత్ లెవెల్ కార్యకర్తలు లేరని, పోల్ మేనేజ్ మెంట్ తెలియదని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు.ఆయన ఎక్కడా పార్టీ వ్యవస్తను పెంపొందించుకోలేదు. పవన్ కు అవన్ని మైనస్ అయితే గెలుపుపై ప్రభావం చూపించవచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తే పవన్ కు అంత ఈజీ కాదని అర్ధం అవుతోంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment