కమలం పార్టీలో పురంధేశ్వరికి ప్రాభవం తగ్గిపోయిందా? ఎన్‌టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన పురంధేశ్వరి రాజకీయాలకు ఇక కాలం చెల్లినట్లేనా? బీజేపీలో చేరినా ఆమె వల్ల ప్రయోజనం లేదని పార్టీ హైకమాండ్ భావిస్తోందా? అందుకే ఆమెను పక్కన పెట్టేశారా? పురంధేశ్వరి భవిష్యత్ ఏంటి?
పదేళ్ళ పాటు కాంగ్రెస్‌లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రంలో మంత్రిగా అధికారాన్ని అనుభవించారు. కాంగ్రెస్ ఓడిపోగానే కమలం కండువా కప్పుకున్నారు. ఎన్‌టీఆర్ కుమార్తెగా బీజేపీ కూడా ఆమెకు ప్రాధాన్యమిచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించి.. రెండు రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించి బీజేపీని నిండు కుండలా మార్చుతారని కమలనాథులు ఆశించారు. కానీ ఇన్ని సంవత్సరాల్లో పురందేశ్వరి వల్ల పార్టీకి ఒరిగిందేమీలేదని హైకమాండ్ తేల్చేసింది. అందుకే ఆమెకు పార్టీ పెద్దలు షాక్ ఇచ్చారు. ముందు ఒడిశా బాధ్యతల నుంచి తర్వాత ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్యతలనుంచి పురందేశ్వరిని తొలగించారు.
కీలకమైన ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్యతల నుంచి పురందేశ్వరిని తొలగించడంతో ఆమె నామమాత్రంగా బిజెపి ప్రధాన కార్యదర్శిగా మిగిలిపోయారు. ఇక ఆ పదవీకాలం కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశముందని తెలుస్తోంది. పురందేశ్వరిని పార్టీలోని కీలక బాధ్యతల నుంచి తప్పించడం వెనుక చాలా కసరత్తే జరిగిందని సమాచారం. నిజానికి పార్టీలో చేరిన కొద్దికాలానికే ఆమెకు బీజేపీలో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు రెండు రాష్ట్రాల ఇన్చార్జ్‌గా నియిమించారు. పదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆమె సేవలు పార్టీకి ఉపయోగపడతాయని బీజేపీ పెద్దలు ఆశించారు. అందుకే వచ్చీ రాగానే ప్రాధాన్యమున్న బాధ్యతలు అప్పగించారు.
కీలక బాధ్యతలు అప్పగించి ప్రాధాన్యత కల్పించినందున.. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని బలోపేతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీలోని కీలక వ్యక్తులను బిజెపిలోకి తీసుకువచ్చే టాస్క్ పురందేశ్వరికి అప్పగించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. పురంధేశ్వరితో పాటు గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్ , సుజనాచౌదరి, కన్నా లక్ష్మినారాయణకు ఆ కమిటీ బాధ్యతలు అప్పగించారు. టిడిపి డబ్బా ఖాళీ చేసి బిజెపి డబ్బా నింపాలని సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా వీరికి ఆపరేషన్ టిడిపి బాధ్యతలు ఇచ్చారు. కమిటీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఏ ఒక్క కీలక నాయకుడిని కూడా టిడిపి నుంచి తీసుకురాలేకపోయారు. పైగా బిజెపిని విస్తరించడంలో, నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా శ్రద్ధ చూపలేదనే అపవాదు మీద వేసుకున్నారు.
చదవండి: (Congress: స్రవంతికే మునుగోడు టికెట్.. తెర వెనుక జరిగిందిదే!)
తమకు బాధ్యతలు ఇచ్చిన బీజేపీ కోసం కాకుండా.. టీడీపీకి అనుకూలంగా బీజేపీని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారనే విషయం పెద్దల దృష్టికి చేరిందంటున్నారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర బిజెపి కీలక నేతలు అధిష్టానానికి సమాచారమిచ్చారట. అయితే పురందేశ్వరి తన తీరు మార్చుకొని బిజెపి బలోపేతం కోసం పనిచేస్తారని పార్టీ హైకమాండ్ ఆశించిందట. బిజెపి ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి బాద్యతలు స్వీకరించాక ఢిల్లీలో గానీ, ఏపిలో గాని ప్రత్యేకంగా విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదనే చెబుతున్నారు. అసలు ఆమె పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో పనిచేస్తున్నారా ? అనే అనుమానం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారట.
జాతీయ స్థాయి పదవిలో పార్టీ ఆమెకు ప్రాధాన్యతనిస్తే కనీసం ప్రధాని నరేంద్రమోడీ విధానాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్ళేందకు ఏమాత్రం ప్రయత్నించలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే పట్టించుకోని నేత రాష్ట్రంలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారా అనే సందేహం బీజేపీ నేతలకు కలుగుతోంది. పార్టీని పట్టించుకోకపోవడానికి వెనుక అసలు కారణం మరొకటి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తన కొడుకును టిడిపి నుంచి పోటీలోకి దింపేందుకే చంద్రబాబుతో ఎన్నడూ లేని సఖ్యత కనబరుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామలన్నింటిని గమనించిన తర్వాతే బిజెపి అధిష్టానం పురంధేశ్వరిని పక్కనబెట్టారట. టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారు కూడా నిర్లిప్తంగానే ఉండటంతో వారిని కూడా పక్కనపెట్టడం ఖాయమనే ప్రచారం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment