సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని కలిసికట్టుగా పని చేయ డం ద్వారా ఇక నుంచి వచ్చే ఏ ఎన్నికల్లో అయినా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఆదివారం తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆర్.సి.కుంతియా అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జూమ్ యాప్ ద్వారా 3 గంటలకుపైగా జరిగింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించా ల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాల ఎన్నికలపై సమావేశంలో పాల్గొన్న నాయకులంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కోర్ కమిటీ నిర్ణయాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు. పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, పార్టీ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
ఆంధ్ర మూలాలున్న వారికి ప్రాధాన్యత
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జరిగిన చర్చలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తన లోక్ సభ పరిధిలోనికి వచ్చే 48 డివిజన్లలో యాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత యాత్ర చేపట్టనున్నట్టు కోర్ కమిటీకి వెల్లడించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్ల ఓట్లు కీలకమని, ఆ మూలాలున్న నాయకులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 30 డివిజన్లలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి టికెట్లు ఇచ్చి విజయం సాధించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీలోని కొందరు నేతలు బీసీల్లో ఒకట్రెండు కులాలకే పదవులు ఇస్తారా అని అర్థంలేని వాదనలు చేస్తూ బీసీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, ఎస్.సంపత్ కుమార్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, వంశీ చంద్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్ది, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి పాల్గొన్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం టీపీసీసీ కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలివే...
– దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి. 2, 3 రోజుల్లో సర్వే జరిపి, ఇప్పటి వరకు పరిశీలనలో ఉన్న నలుగురు అభ్యర్థిత్వాలను పరిశీలించి జిల్లా నాయకులతో మాట్లాడి వారం రోజుల్లో అభ్యర్థిని ప్రకటించాలి.
– జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్ సభల వారీగా ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీలున్నంత త్వరగా డివిజన్ కమిటీలు పూర్తి చేసి అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలి.
– ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల కోసం పార్టీ సీనియర్లతో వెంటనే కమిటీలు వేయాలి.
– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించి, సర్వేలు నిర్వహించిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయాలి.
విజయమే లక్ష్యం!
Published Mon, Sep 7 2020 2:06 AM | Last Updated on Mon, Sep 7 2020 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment