ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. అదే నెల 8న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. జంగ్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తర్విందర్ సింగ్ మార్వాను, కాంగ్రెస్ ఫర్హాద్ సూరిని పోటీకి నిలిపింది. దీంతో మనీష్ సిసోడియాకు గట్టిపోటీ ఎదురుకానుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సిసోడియా ఇంతకుముందు 2013, 2015, 2020లలో పట్పర్‌గంజ్ నుండి పోటీ చేశారు. కానీ ఈసారి పార్టీ ఆయన స్థానాన్ని మార్చింది. కాగా ఢిల్లీ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ.. జంగ్‌పురా అసెంబ్లీ సీటుపై తన జెండాను ఎగురవేయలేకపోయింది. 1993, 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకోగా, 2013, 2015, 2020లలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే బీజేపీ అభ్యర్థి నాటి విజేతలకు గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తర్విందర్ సింగ్ మార్వా ప్రవేశంతో ఈ స్థానానికి సంబంధించిన సమీకరణలన్నీ మారిపోయాయి.
తర్విందర్ సింగ్ మార్వా గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఈ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1998, 2003,2008లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఫర్హాద్ సూరి ఈ స్థానం నుంచి బీజేపీకి గట్టిపోటీ ఇస్తారని, ఇటువంటి పరిస్థితిలో సిసోడియా మూడవ స్థానంలో ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ స్థానంలో ఆప్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిందని, ఈ సారి కూడా జంగ్‌పురా సీటు ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకే వస్తుందని సిసోడియా ఆశలు పెట్టుకున్నారు.
గత మూడు ఎన్నికల్లో జంగ్‌పురా అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన హవా చాటింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఇంతియాజ్ సింగ్ బక్షిని 16 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా నాడు మూడవ స్థానంలో నిలిచారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవీణ్ కుమార్ బీజేపీకి చెందిన మణీందర్ సింగ్ ధీర్‌ను 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మార్వా మూడవ స్థానంలో నిలిచారు.
ఇది కూడా చదవండి: మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు
Comments
Please login to add a commentAdd a comment