సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలతో మంతనాలు జరిపారు. త్వరలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదం కోసం సమర్పించాల్సిన జాబితాపై పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోంది. ఇప్పటికే దాదాపు తొలి జాబితా ఖరారు అయినప్పటికీ, జాబితా విడుదల తర్వాత ఎలాంటి అసంతృప్త స్వరాలు వినిపించకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నారు.
సుమారు 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కిషన్‌రెడ్డి, పార్టీ ఇతర పెద్దలను కూడా కలసి తొలి జాబితాపై వారితో చర్చించారని సమాచారం. అంతేగాక రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రచారాన్ని ఏ విధంగా దూకుడుగా తీసుకెళ్లాలన్న అంశంపై కిషన్‌రెడ్డికి అమిత్ షా దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.
కాగా, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి.. ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలనే అంశాలపై ఖరారైన ప్రణాళికను కిషన్‌రెడ్డి, అమిత్ షాకు వివరించారు. వీటితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రుల పర్యటనల గురించి చర్చించారు. ముఖ్యంగా ఎన్నికలవేళ తె లంగాణ కోసం గత తొమ్మిదిన్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, అభివృద్ధి పథకా ల గురించి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్య తిరేక విధానాలు, అవినీతి వంటి అంశాలపై ప్రజ లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టా లని అమిత్ షా సూచించారని తెలిసింది.
కాగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల తొలి జాబితాను ఢిల్లీ నుంచి కేంద్ర పార్టీ విడుదల చేస్తుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment