ఎన్నికల వేళ కలకలం.. సోషల్‌ మీడియాలో అమిత్‌ షా ఫేక్‌ వీడియో! | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ కలకలం.. సోషల్‌ మీడియాలో అమిత్‌ షా ఫేక్‌ వీడియో!

Published Mon, Apr 29 2024 9:38 AM

Delhi Police Case Registered Over Amit Shah Fake Video

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సంబంధించిన ఫేక్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామెంట్స్‌ ఉన్నాయి. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది.

 

 

ఇక, వీడియోపై కాంగ్రెస్‌ స్పందించింది. రిజర్వేషన్‌ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫేక్‌ వీడియోపై బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాలవీయా.. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది. చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement