సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన. చిత్రంలో ప్రజా ప్రతినిధులు, మేధావులు
రాష్ట్రంలో మరెవరికీ న్యాయం జరగకుండా తమ వారికి మాత్రమే ప్రయోజనం కల్పించే వ్యూహంతోనే అమరావతిని రాజధాని చేయాలనుకుని రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు నట్టేట ముంచేశారు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.
– మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందని మేధావులు, రాజకీయ నేతలు స్పష్టంచేశారు. విభజన సమయంలో వేలాది మంది మనోభావాలను స్వయంగా అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికను చంద్రబాబు కాలగర్భంలో కలిపేసి ప్రస్తుత సమస్యకు కారణమయ్యారని వారు విమర్శించారు.
హైదరాబాద్‌లో పెట్టిన రూ.వేల కోట్ల పెట్టుబడులను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం నలుమూలలా పెట్టి ఉంటే మనం ఇంతగా నష్టపోయే వారం కాదన్నారు. ఆ పొరపాటును మళ్లీ పునరావృతం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రోడ్డెక్కడం మూర్ఖత్వంగా వారు అభివర్ణించారు.
పాలనా వికేంద్రీకరణపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం రాజమహేంద్రవరం ఎంపీ, పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో విభిన్న రంగాలకు చెందిన మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్, విద్యావేత్తలు, వైద్యులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్యఅతిథిగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై మాట్లాడారు.
నిపుణుల సూచనలకు అనుగుణంగానే..
నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగానే పాలనా వికేంద్రీకణ చేస్తున్నట్లు ధర్మాన చెప్పారు. దేశంలో అత్యున్నతమైన మేధావులు ప్రొ. మహవీర్, కేటీ రవీంద్రన్, అంజలీమోహన్ తదితరులతో ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు తుంగలోకి తొక్కడమే కాక నారాయణ కమిటీని వేసి తప్పు మీద తప్పు చేశారన్నారు.
రాష్ట్ర విభజన తరువాత పార్లమెంటు చేసిన పునర్నిర్మాణ చట్టంలో తీసుకొచ్చిన సెక్షన్–6 మరే రాష్ట్ర విభజన సమయంలో చేయలేదన్నారు. ఇక విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్–6లోని సిఫార్సులను ఎందుకు ఆమోదించలేదో చంద్రబాబు బదులివ్వాలని ధర్మాన డిమాండ్ చేశారు.
కమిటీ నివేదికను అమలుచేయడం తప్ప మరో గత్యంతరం లేదన్నారు. అందుకే అన్ని రకాలుగా అనువైన విశాఖపట్నం సిటీ కాస్మోపాలిటన్ నగరంగా ఉండటంతో దానిని కార్యనిర్వాహణ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారన్నారు.
అబద్ధాలు ఆడటమే చంద్రబాబు ఎజెండా : వేణు
చంద్రబాబు ప్రదాన ఎజెండా అబద్ధాలు అడటమని.. వాటిని ఎల్లో మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మరో మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శించారు. అమరావతిని రాజధాని చేస్తానని చంద్రబాబు.. వికేంద్రీకరణ చేస్తామని తాముచెప్పి ఎన్నికలకు వెళ్తే ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టి చంద్రబాబుని ఓడించారన్నారు. అంటే ప్రజలంతా వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నారన్నారే విషయం స్పష్టమైందని మంత్రి అన్నారు.
కమిషన్ నివేదిక బుట్టదాఖలు : బోస్
ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను చంద్రబాబు చెత్తబుట్టలో వేయడంతోనే ప్రాంతీయ విభేదాలు తలెత్తాయన్నారు. ఇక కోర్టులు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడంపై పునారాలోచించుకోవాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు కూడా రాజధాని విషయం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమని తెల్చి చెప్పిందని.. కోర్టులన్నా, న్యాయమూర్తులన్నా తనకు అపారమైన గౌరవం ఉందని బోస్ చెప్పారు.
పాలనాపరంగా విశాఖ మేలు : భరత్‌రామ్
ఇక రాష్ట్రంలో అద్భుత నగరమైన విశాఖపట్నం పాలనాపరంగా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ అభిప్రాయపడ్డారు. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి అద్భుతమైన రాజధానిగా, నెంబర్‌వన్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు. రాజధాని పేరుతో టీడీపీ తన ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భరత్‌రామ్ ఎద్దేవా చేశారు.
మాజీమంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. 2014లో కేవలం సీనియర్ అనే కారణంతో ప్రజలు బాబుకు పట్టంకట్టిన పాపానికి నేడు ఇన్ని అనర్థాలకు ఆయన కారణమయ్యారన్నారు. 16 రాష్ట్రాల్లో ఒకచోట అసెంబ్లీ, మరోచోట న్యాయవ్యవస్థ నడుస్తుంటే.. చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం చరిత్రను మసిబూసి మారేడు కాయగా చేస్తోందని మండిపడ్డారు. తమ భూముల విలువ పెంచుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని ఆక్షేపించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, సత్తి సూర్యనారాయణరెడ్డి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కవురు శ్రీనివాసరావు, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, విభిన్న రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు.
జగన్ నిర్ణయం శాస్త్రీయం
వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో మూడుచోట్ల రాజధానుల ఏర్పాటు అనేది శాస్త్రీయమైనది. చంద్రబాబు తన కోటరీకి లాభం చేకూర్చేలా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలని జగన్ భావిస్తున్నారు.
– జార్జి విక్టర్, మాజీ వైస్‌చాన్సలర్, నన్నయ విశ్వవిద్యాలయం
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌వల్లే ఆటంకాలు
రాజధాని పేరుతో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది. అందుకే వికేంద్రీకరణకు ఆటంకాలు కల్పిస్తున్నారు. వికేంద్రీకరణవల్ల ఎటువంటి నష్టమూ ఉండదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఉంటే జిల్లా కోర్టు రాజమహేంద్రవరంలో ఉండేది. దానివల్ల ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందీ కలగలేదు.
– డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు
అభివృద్ధిలో సమానత్వం
రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను బట్టి రాజధానిని నిర్ణయించాలి. జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలకు రెండు రాజధానులున్నాయి. ఒకటి కంటే ఎక్కువ రాజధానులున్నంత మాత్రాన అభివృద్ధి జరగదనుకుంటే పొరపాటు. చాలా రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి కదా! పాలనా వికేంద్రీకరణతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అభివృద్ధిలో సమానత్వం వస్తుంది.
– గన్ని భాస్కరరావు, ఐఎంఏ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment